ఒకే రోజు రెండు కొవిడ్ డోసులు! ఆ మహిళకు ఏమైందంటే... 

ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్ మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినే ఆయుధమని వైద్య సంస్థలు చెబుతున్నారు. దేశంలోనూ వ్యాక్సినేషన్ ను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. మన దేశంలో రెండు టీకాలు అందుబాటులో ఉండటంతో... వాటిని పంపిణి చేస్తున్నారు. అయితే వ్యాక్సిన్ల రెండు డోసుల మధ్య కొంత దూరం అవసరమని ప్రభుత్వం చెబుతోంది. కోవిషీల్డ్ టీకా రెండో డోసుకు 12 నుంచి 14 వారాల గడువు ఉండగా.. కొవాగ్జిన్ అయితే 4 నుంచి 6 వారాల వ్యవధిలోనూ సెకండ్ డోసు తీసుకోవాల్సి ఉంటుంది. 

వ్యాక్సిన్ పంపిణిపై పక్కగా ప్రోటోకాల్ ఉన్నా కొందరు ఆరోగ్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.  రాజస్థాన్‌లోని దౌసాలో ఓ మహిళ (44)కు ఒకేసారి రెండు డోసులూ ఇచ్చేశారు అక్కడి వైద్య సిబ్బంది. ఉదయం 9 గంటలకు ప్రజారోగ్య కేంద్రానికి వెళ్తే 11 గంటలకు వ్యాక్సిన్ వేశారని, సాయంత్రం తన భార్యకు జ్వరంగా ఉంటే ఏమైందని అడిగితే తనకు రెండు డోసులు వెంటవెంటనే ఇచ్చారని చెప్పడంతో షాకయ్యారని ఆమె భర్త చరణ్ శర్మ తెలిపారు.  ఒక రోజు రెండు డోసులు ఇచ్చారన్న వార్త స్థానికంగా కలకలం రేపింది. ఆ మహిళకు ఏమవుతుందోమోనన్న ఆందోళన కనిపించింది. 

చరణ్ శర్మ ఆరోపణలను ఆసుపత్రి సిబ్బంది కొట్టిపడేశారు. ఒకేసారి రెండో డోసులు ఇవ్వడం సాధ్యం కాదని, అది నిబంధనలకు విరుద్ధమని దౌసా చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్  మనీష్ చౌదరీ చెప్పారు. తొలుత వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తే రక్తం రావడంతో సిబ్బంది విరమించుకున్నారని, ఆ తర్వాత మరో ప్రాంతంలో టీకా వేశారని ఆయన  చెప్పారు.  సూదిని రెండుసార్లు పొడవడంతో తనకు రెండు డోసులు ఇచ్చేసినట్టు ఆమె భయపడుతోందని అన్నారు. మహిళ ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు వైద్య బృందాన్ని ఆమె గ్రామానికి పంపినట్టు చెప్పారు. ఆమె ఆరోగ్య పరిస్థితి సాధారణంగానే ఉన్నట్టు వైద్యులు గుర్తించారని తెలిపారు. ఆమెలో ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించలేదన్నారు. 

మరోవైపు ఏకకాలంలో రెండు మోతాదులు తీసుకున్నా దుష్ప్రభావాలేమీ ఉండమని ఎస్ఎంఎస్ మెడికల్ కాలేజీ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ రమణ్ శర్మ తెలిపారు. ఫేజ్ 2 ట్రయల్స్‌లో దీనిని కూడా పరీక్షించామని, ఎలాంటి సైడ్ ఎఫెక్టులు రాలేదని చెప్పారు. 
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu