ఆమెకు సెల్యూట్‌.. పేట్రియాటిక్‌ ల‌వ్‌స్టోరీ.. పుల్వామా అమ‌రుడి అడుగుజాడ‌..

‘‘ఐ లవ్‌ యూ విభూ.. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. నా ప్రయాణం ఇప్పుడే మొదలైంది. విభూ వదిలి వెళ్లిన మార్గాన్ని నేను కొనసాగిస్తున్నా. నా మీద నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.’’ అంటూ ఉద్వేగభరితంగా చెప్పుకొచ్చారు నిఖితాకౌల్‌. 

పై వ్యాఖ్య‌లు చ‌దివి.. ఇదేదో ప్రేమ వ్య‌వ‌హారం అనుకునేరు. ప్రేమే.. కానీ వ‌ట్టి ప్రేమ మాత్ర‌మే కాదు. అంత‌కుమించి. భర్తతోపాటు ఆయన బాధ్యతనీ ప్రేమించి, దేశానికి సేవ చేయాలన్న తన కలను కొనసాగించడానికి కొత్త ప్రమాణం మొదలుపెట్టారు నిఖితాకౌల్‌. ఏడాది పోరాటం.. ఆమె సాధించిన విజ‌యం ఎంతోమందికి స్ఫూర్తి దాయ‌కం.  

పుల్వామా దుర్ఘ‌ట‌న గుర్తుండే ఉంటుందిగా. 2019లో క‌శ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్ర‌వాదులు జ‌వాన్లు వెళుతున్న వాహ‌నాన్ని పేల్చేశారు. ఆ ఉగ్ర‌దాడిలో మేజ‌ర్ విభూతి శంక‌ర్ సైతం అమ‌రుల‌య్యారు. అప్పటికి ఆయనకు వివాహమై తొమ్మిది నెలలే అయింది. 27 ఏళ్ల వయసులోనే భర్తను కోల్పోయిన ఆమెను చూసి అందరూ బాధపడ్డారు. ఆ పుల్వామా అమ‌రుడు విభూతి శంక‌ర్‌ భార్యే నిఖితాకౌల్‌.

అంద‌రిలా ఆమె భ‌ర్త చ‌నిపోయాడ‌ని ఏడుస్తూ కూర్చోలేదు. త‌న త‌ల‌రాత‌ ఇంతేనంటూ త‌ల్ల‌డిల్లిపోలేదు. విధికి ఎదురునిలిచి.. త‌న త‌ల‌రాత‌ను తిరిగి రాసుకుంటున్నారు. మేజ‌ర్ విభూ మీద ప్రేమతో.. తాను సైతం ఆర్మీలే చేరాల‌ని.. దేశ ర‌క్ష‌ణ బాధ్య‌త‌లు చేప‌ట్టాల‌ని త‌లిచారు. అప్ప‌టికే ఢిల్లీలో చేస్తున్న‌ మంచి ఉద్యోగాన్ని వ‌దిలేశారు. ఆర్మీలో చేరేందుకు శిక్షణ తీసుకున్నారు. షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) రాతపరీక్షనూ, సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డ్‌ (ఎస్‌ఎస్‌బీ) ఇంటర్వ్యూనూ స‌క్సెస్‌ఫుల్‌గా పూర్తిచేశారు.   

భర్త శిక్షణ పూర్తి చేసిన చెన్నైలోని ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీలోనే సీటు సాధించారు నిఖిత‌. ‘అర్హత సాధించడానికి చాలా కష్టపడ్డాను. ఏడాది శిక్షణనూ పట్టుదలగా పూర్తిచేశాను. విభూ గర్వించే ఆఫీసర్‌ అవ్వాలన్నది నా కల’ అంటారామె. 

ఆర్మీ శిక్షణ పూర్తి చేసుకుని తాజాగా లెఫ్టినెంట్‌గా బాధ్యతలు చేపట్టారు. శనివారం చెన్నైలో జరిగిన పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌లో పుల్వామా అమరుడు మేజర్‌ విభూతి శంకర్‌ దౌండియాల్‌ సతీమణి నిఖిత.. ఆర్మీలో లెఫ్టినెంట్‌గా బాధ్యతలు చేపట్టారు. ఉత్తర కమాండ్‌ చీఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ వైకే జోషీ స్వయంగా ఆమె భుజాలపై నక్షత్రాలు పెట్టి సైన్యంలోకి తీసుకున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu