టీవీకే విజయ్ కరూర్ పర్యటన వాయిదా.. ఎందుకంటే?
posted on Oct 18, 2025 3:59AM

తమిళగ వెట్రి కజగం(టీవీకే) అధినేత విజయ్ కరూర్ పర్యటన వాయిదా పడింది. వాస్తవానికి ఆయన శుక్రవారం (అక్టోబర్ 17)న కరూర్ లో పర్యటించి గత నెల 27న టవీకే ప్రచార సభలో జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి బంధువులను పరామర్శించాల్సి ఉంది. అయితే చివరి నిముషంలో విజయ్ తన పర్యటన వాయిదా వేసుకున్నారు. ఇంతకీ ఆయన పర్యటన వాయిదాకు కారణమేంటంటే..
41 మంది మరణానికి కారణమైన కరూర్ తొక్కిసలాట ఘటనపై సుప్రీం ఆదేశాల మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ దర్యాప్తు చేపట్టింది. సీబీఐ అధికారులు దర్యాప్తులో భాగంగా శుక్రవారమే (అక్టోబర్ 17) కరూర్ చేరుకున్నారు. ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ సీబీఐ అదనపు డీఎస్పీలు ముఖేష్ కుమార్, రామకృష్ణన్ దర్యాప్తులో భాగంగా కరూర్ చేరుకున్నారు. వీరు సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేస్తారు. అలాగే కరూర్ సభ సందర్భంగా భద్రత, రద్దీ నియంత్రణలో వైఫల్యాలు, తమిళనాడు పోలీసులు మంజూరు చేసిన అనుమతులను తొక్కిసలాటకు సంబంధించిన సీసీ ఫుటేజీలు పరిశీలిస్తారు. ఈ నేపథ్యంలోనే దర్యాప్తునకు ఆటంకం కలిగించవద్దన్న ఉద్దేశంతో టీవీకే అధినేత విజయ్ తన పర్యటనను వాయిదా వేసుకున్నారు.