చైల్డ్ పోర్న్‌పై సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్... 24 మంది అరెస్ట్

 

తెలంగాణ రాష్ట్రంలో చైల్డ్ పోర్నోగ్రఫీ కట్టడికి సైబర్ సెక్యూరిటీ బ్యూరో చేపట్టిన సంచలన ఆపరేషన్ రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. పిల్లలపై జరుగుతున్న ఆన్‌లైన్ లైంగిక దుర్వినియోగాన్ని అడ్డుకునే లక్ష్యంతో ఒక్కరోజు వ్యవధిలోనే 18 ప్రత్యేక బృందాలతో తెలంగాణ వ్యాప్తంగా దాడులు నిర్వహించిన అధికారులు, చైల్డ్ పోర్న్ కంటెంట్‌ను చూస్తూ, షేర్ చేస్తూ, అప్లోడ్ చేస్తున్న 24 మంది నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

ఈ కేసులో అత్యధికంగా హైదరాబాద్ నగరానికి చెందిన వారే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అరెస్ట్ అయిన నిందితుల్లో ఇరిగేషన్ శాఖకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి కూడా ఉండటం సంచలనంగా మారింది. నిందితుల వయస్సు 18 నుంచి 48 సంవత్సరాల మధ్య ఉండగా, వారంతా మధ్యతరగతి వర్గానికి చెందినవారు, వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులే కావడం గమనార్హం. అరెస్ట్ అయిన

నిందితుల మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, డిజిటల్ స్టోరేజ్ పరికరాలను ఫోరెన్సిక్ పరిశీలన చేయగా, వీరి వద్ద భారీగా చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలు లభ్యమయ్యాయి. ఈ వీడియోలు ప్రధానంగా విదేశాలకు చెందిన 4 నుంచి 14 ఏళ్ల మధ్య వయస్సు గల మైనర్ బాలికలవిగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. సోషల్ మీడియా యాప్‌లు, ఎన్‌క్రిప్టెడ్ ప్లాట్‌ఫార్ములు, మెసేజింగ్ యాప్‌ల ద్వారా ఈ కంటెంట్‌ను షేర్ చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.ఈ వ్యవహారంపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు మాట్లాడుతూ, చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన నేరాలపై ఏమాత్రం ఉపేక్ష ఉండదని స్పష్టం చేశారు. 

ఐటీ యాక్ట్‌తో పాటు పోక్సో చట్టం కింద నిందితులపై కఠిన కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ తరహా నేరాల్లో పాల్గొన్నవారిని గుర్తించేందుకు అధునాతన టెక్నాలజీ, అంతర్జాతీయ ఏజెన్సీల సహకారంతో మరింత నిఘా పెంచుతున్నట్లు తెలిపారు. చైల్డ్ పోర్న్ కంటెంట్‌ను చూడడం, డౌన్‌లోడ్ చేయడం, షేర్ చేయడం కూడా నేరమేనని అధికారులు మరోసారి హెచ్చరించారు. ఇటువంటి కంటెంట్‌పై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు లేదా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ సంచలన ఆపరేషన్‌తో తెలంగాణలో చైల్డ్ పోర్నోగ్రఫీపై ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో స్పష్టమైందని, పిల్లల భద్రతే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు అధికారులు తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu