తిరుమల లడ్డు నెయ్యి కల్తీ కేసులో సంచలన విషయాలు

 

తిరుమల లడ్డూలో ఉపయోగించే నెయ్యికి సంబంధించి కల్తీ ఆరోపణల కేసులో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. నెయ్యి సరఫరా చేస్తున్న కొన్ని కంపెనీలకు అనుకూలంగా వ్యవహరించడంతో పాటు లంచాలు తీసుకున్నట్టు టీటీడీ డైరీ ఎగ్జిక్యూటివ్ విజయ భాస్కర్ రెడ్డి అంగీకరించినట్టు సిట్ విచారణలో వెల్లడైంది. ఈ కేసులో ఆయనను A-34గా పేర్కొన్నారు.

ముందస్తు బెయిల్ కోసం నెల్లూరు ఏసీబీ  కోర్టులో విజయ భాస్కర్ రెడ్డి వేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు, సిట్ తరఫున అసిస్టెంట్ పీపీ జయశేఖర్ వాదనలు వినిపించగా వాటిని సమర్థిస్తూ బెయిల్‌ను తిరస్కరించింది. సిట్ వివరాల ప్రకారం 2023లో భోలే బాబా కంపెనీ నుంచి రూ.75 లక్షల లంచం, ప్రీమియర్ కంపెనీ నుంచి రూ.8 లక్షలు, ఆల్ఫా డైరీ నుంచి ఎనిమిది గ్రాముల బంగారం లంచంగా స్వీకరించినట్టు బయటపడింది. నిందితుడు నెల్లూరు ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ నేపథ్యంలో ఈ విషయాన్ని వెలిబుచ్చారు. 

ఇవన్నీ హవాలా మార్గంలో స్వీకరించినట్టు సిట్ గుర్తించింది. 2019 నుంచి 2024 వరకు సంబంధిత కంపెనీల పనితీరు సరైన విధంగా లేకపోయినా, నెయ్యి క్వాలిటీ బాగుందని తప్పుడు రిపోర్టులు ఇచ్చిన కారణంగా టిటిడికి సుమారు రూ.118 కోట్ల మేర నష్టం జరిగినట్టు విచారణలో తేలింది. ఇప్పటికే విజయ భాస్కర్ రెడ్డి నుండి సిట్ రూ.34 లక్షలను సీజ్ చేసింది. దీంతో నిందితుడికి బెయిల్ ఇవ్వొద్దని అసిస్టెంట్‌ పీపీ వాదనలు వినిపించారు. ఈ వాదనలతో ఏకీభవించిన నెల్లూరు ఏసీబీ కోర్టు.. విజయ భాస్కర్ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ను డిస్మిస్‌‌ను చేసింది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu