త్వరలో 73 రాజ్యసభ స్థానాలు ఖాళీ

 

2026 లో రాజ్యసభ నుంచి ఈ ఏడాదిలో ఏకంగా 73 మంది రిటైర్డ్ కానున్నారు. వాళ్ల వివరాలను రాజ్యసభ సచివాలయం బులిటెన్ ద్వారా వెల్లడించింది, వీళ్లలో దశాబ్దాలుగా పని చేసిన అనుభవఘ్నలైన నేతలు కూడా ఉన్నారు. రాజ్యసభలో ఈ ఏడాది మార్చి నుంచి నవంబర్ మధ్య కాలంలో 73 మంది ఎంపీలు సభ్యులు తమ పదవీ కాలాన్ని పూర్తి చేసుకోనున్నారు. ఈ సభ్యుల పదవీ విరమణతో పలు రాష్ట్రాల నుంచి ఖాళీలు ఉంటాయి. ఈ 73 మంది సభ్యులలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్ నుంచి 10 మంది ఉన్నారు. మహారాష్ట్ర నుంచి ఏడుగురు, తమిళనాడు నుంచి ఆరుగురు సభ్యులు పదవీ విరమణ చేస్తున్నారు. 

పశ్చిమబెంగాల్, బిహార్ రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరి నుంచి ఐదుగురు చొప్పున సభ్యులు బయటకు వెళ్తున్నారు.ఆంధ్రప్రదేశ్, ఒడిశా, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల నుంచి నలుగురు చొప్పున రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. అసోం, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి ముగ్గురు చొప్పున సభ్యులు తమ పదవీ కాలాన్ని పూర్తి చేసుకుంటున్నారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, హరియాణా, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి ఇద్దరు చొప్పున సభ్యులు పదవీ విరమణ చేస్తున్నారు. 

హిమాచల్‌ప్రదేశ్, మణిపుర్, మేఘాలయ, మిజోరం, అరుణాచల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరు చొప్పున సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన వైఎస్సార్‌సీపీకి చెందిన అయోధ్య రామి రెడ్డి, పరిమళ్‌ నత్వానీ, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, అలాగే టీడీపీకి చెందిన సానా సతీష్‌బాబు తమ పదవీకాలాన్ని పూర్తి చేసుకోనున్నారు. ఈ నాలుగు స్థానాలూ రాబోయే ఎన్నికల్లో కూటమి పార్టీలకే దక్కే అవకాశాలు న్నాయని భావిస్తున్నారు. 

ఇక తెలంగాణ విషయాని కొస్తే, బీఆర్ఎస్ సభ్యుడు కేఆర్‌ సురేష్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కేశవరావు రాజీనామాతో జరిగిన ఉప ఎన్నికలో గెలుపొందిన సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ కూడా పదవీ విరమణ చేయనున్నారు. తెలంగాణలో ఉన్న రెండు రాజ్యసభ స్థానాలను అధికార పార్టీ కాంగ్రెస్‌ గెలుచుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే త్వరలో ఖాళీ కానున్న 73 సీట్లకు ఫిబ్రవరిలో రాజ్యసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయనుంది, ఏప్రిల్ నెలలో తొలి విడత నవంబర్ లో రెండో విడతలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu