నేను డాక్టర్‌ను కాదు... కానీ సోషల్ డాక్టర్‌ను : సీఎం రేవంత్‌రెడ్డి
posted on Jan 10, 2026 7:34PM
.webp)
హైదరాబాద్‌లో జరుగుతున్న ఫెలోస్ ఇండియా కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని యువ కార్డియాలజిస్టులను ఉద్దేశించి మాట్లాడారు. “నేను మెడికల్ డాక్టర్ కాదు… కానీ సోషల్ డాక్టర్‌ను” అంటూ ఆయన ప్రారంభించారు. భారత్‌తో పాటు ఆగ్నేయాసియా దేశాల నుంచి 500 మందికి పైగా యువ కార్డియాలజిస్టులు హైదరాబాద్‌కు రావడం గర్వకారణమని అన్నారు.
డాక్టర్ల వృత్తిలో నిరంతరం నేర్చుకోవడం అత్యంత కీలకం అని రేవంత్ రెడ్డి సూచించారు. కొత్త జ్ఞానం, నైపుణ్యాలను నిర్లక్ష్యం చేస్తే కెరీర్ అంతమైన్నట్లేనని స్పష్టం చేశారు. లైఫ్ సైన్సెస్, ఫార్మా, హెల్త్‌కేర్ రంగాల ఆవిష్కరణలకు హబ్‌గా హైదరాబాద్ వేగంగా ఎదుగుతోందని ఆయన గుర్తుచేశారు.
డాక్టర్లు సమాజంలో ప్రత్యేక స్థానం కలిగి ఉన్నారని, ప్రాణాలను కాపాడే దేవతలుగా ప్రజలు వారిని నమ్ముతారని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, మెరుగైన హెల్త్ పాలసీల కోసం వైద్యులతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
క్వాంటం కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక సాంకేతికతలతో ఆరోగ్యరంగం వేగంగా మారుతున్న నేపథ్యంలో, డాక్టర్లు టెక్నాలజీతో పాటు మానవత్వాన్ని కూడా మర్చిపోవద్దని ఆయన పిలుపునిచ్చారు.ఈ మధ్య కాలంలో గుండె జబ్బులు పెరుగుతున్నందున, వాటిని నివారించే మిషన్‌లో అందరూ భాగస్వాములై పనిచేయాలని సూచించారు.
ముఖ్యంగా విద్యార్థులకు CPR శిక్షణ అందించడంలో వైద్యులు ముందుకు వస్తే అనేక ప్రాణాలను కాపాడగలమని చెప్పారు.నివారణపై అవగాహన కల్పించడం సమాజానికి మేలు చేస్తుందని పేర్కొన్న సీఎం, క్వాలిటీ హెల్త్‌కేర్ అందించడంలో భారత్ ప్రపంచంలోనే ఉత్తమంగా నిలవాలని, ప్రతి వైద్యుడు ఉత్తముడిగా ఎదగాలని ఆశాభావం వ్యక్తం చేశారు.