డెయిరీ రంగ సేవలకు భువనేశ్వరికి అరుదైన అవార్డు

 

భారత డెయిరీ రంగ అభివృద్ధిలో విశిష్ట సేవలకు హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ వైస్ ఛైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరికి ప్రతిష్ఠాత్మక 'అవుట్‌స్టాండింగ్ డెయిరీ ప్రొఫెషనల్ అవార్డు-2025' సౌత్‌జోన్ ప్రదానం చేసింది. డెయిరీ పరిశ్రమ అభివృద్ధిలో ఆమె చూపిన దూరదృష్టి నాయకత్వం, రైతుల సాధికారతకు చేసిన విశేష కృషి, డెయిరీ ఎకోసిస్టంపై ఆమె కల్పించిన సానుకూల ప్రభావాన్ని గుర్తిస్తూ ఈ అవార్డు వరించింది. 

ఈ నెల 9న కేరళలోని కోజికోడ్‌లో కాలికట్ ట్రేడ్ సెంటర్, డాక్టర్ వర్గీస్ కురియన్ నగర్‌లో నిర్వహించిన సదరన్ డెయిరీ అండ్ ఫుడ్ కాన్‌క్లేవ్ - 2026 ప్రారంభ సమావేశంలో ఆ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి జే.చించు రాణి చేతుల మీదుగా భువనేశ్వరి ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ అవార్డు అందుకోవడంపై భువనేశ్వరి స్పందించారు. తనకు ఈ గౌరవాన్ని అందించిన ఇండియన్ డెయిరీ అసోసియేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని వేలాది మంది పాడి రైతులకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు.

భారత డెయిరీ రంగం అభివృద్ధి, శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేస్తానని మరోసారి స్పష్టం చేశారామె.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సతీమణి నారా భువనేశ్వరిపై ప్రశంసలు కురిపించారు.  ఆమెకు మరో ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారాయన. పాడి రైతుల అభ్యున్నతి, మహిళా సాధికారత కోసం ఆమె చేస్తున్న కృషి ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ పురస్కారం భువనేశ్వరి సహా ఆమె బృందానికి దక్కాల్సిన సరైన గుర్తింపు అని సీఎం పేర్కొన్నారు. ఈ గౌరవం వెనుక ఆంధ్రప్రదేశ్‌లోని వేలాది మంది పాడి రైతుల కృషి ఉందన్నారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu