దిమ్మ తిరిగి బొమ్మ కనిపించడం అంటే ఇదేగా ట్రంపూ!
posted on Sep 17, 2025 11:58AM
.webp)
అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ కు దిమ్మతిరిగి బొమ్మ కనిపించడం అంటే ఏమిటో ఇప్పటికి అర్ధమైనట్లు కనిపిస్తోంది. అందుకే ఒక్క సారిగా విదేశీ వర్కర్ల విషయంలో యూటర్న్ తీసుకున్నారు. ఇంతకీ విషయమేంటంటే..
అమెరికా ఫస్ట్ అంటూ దేశంలోకి విదేశీయుల ప్రవేశంపై ఇష్టారీతిగా ఆంక్షలు విధించి.. బయటవారిని రానివ్వం అంటూ గప్పాలు పలికిన ట్రంప్ అదే నోటితో విదేశీ వర్కర్లకు స్వాగతం పలకాల్సిన పరిస్థితికి వచ్చారు. ఆయన స్వయంగా విదేశీ వర్కర్లకు స్వాగతం పలుకుతామని ప్రకటించడంతోనే ట్రంప్ బేలతనం అందరికీ అవగతమైంది. అనుభవం అయితే తప్ప ట్రంప్ కు తత్వం బోదపడలేదన్న సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి.
ఇంతకీ అసలేమైందంటే.. దక్షిణ కొరియాకు చెందిన హ్యుండయ్ కంపెనీ అమెరికాలో ప్లాంట్ నిర్మిస్తోంది. అక్కడ పని చేయడానికి అమెరికాలో అమెరికాలో వర్కర్లు లేకపోవడంతో.. ఆ కంపెనీ వర్కర్లను దక్షిణ కొరియా నుంచే తీసుకువెళ్లింది. అయితే అలా దక్షిణ కొరియా నుంచి వచ్చిన వర్కర్లను అమెరికా యంత్రాంగం నిబంధనల పేరుతో అడ్డుకుంది. బంధించింది. దీంతో దక్షిణ కొరియా షార్ప్ గా రియాక్టైంది. తమ దేశానికి చెందిన వర్కర్లను స్వదేశానికి తీసుకువెళ్లిపోయింది.
అంతే కాదు.. హ్యుండయ్ కంపెనీ... అమెరికాలో పెట్టుబడుల విషయంలో పునరాలోచనలో పడింది. ఇదే విషయాన్ని బాహాటంగా ప్రకటించింది. దీంతో ట్రంప్ ఉలిక్కిపడ్డారు. హ్యుండయ్ కనుక అమెరికాలో పెట్టుబడుల విషయంలో వెనకడుగు వేయడం అంటూ జరిగితే.. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల నుంచీ కూడా పెట్టుబడి దారులు అదే దారిలో నడుస్తాయన్న భయం ట్రంప్ ను వణికించేసింది. ఇప్పటికే అమెరికాలో అడుగుపెట్టేందుకు ముందువెనుకలాడుతున్నాయి. దీంతో వెంటనే ట్రంప్ దేశం లోకి విదేశీ వర్కర్లను అనుమతిస్తామంటూ ప్రకటన చేసేశారు.