ఆర్టీసీ బస్సులో సినిమాకు వెళ్లిన సీఎం రేవంత్, మంత్రులు
posted on Jan 5, 2026 8:46PM
.webp)
ప్రముఖ సామాజిక సంస్కర్త సావిత్రీబాయి పూలే జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘పూలే’ సినిమాను వీక్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి ఆర్టీసీ బస్సులో బయలుదేరారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం అందరూ కలిసి బస్సులో ప్రయాణించి ప్రసాద్ ల్యాబ్‌కు చేరుకుని సినిమాను వీక్షించారు. ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న బస్సుకు పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే ‘పూలే’ సినిమాను హిందీ భాషలో తెరకెక్కించగా 2025 ఏప్రిల్ 25న విడుదలైంది. ఈ చిత్రానికి అనంత్ మహదేవన్ దర్శకత్వం వహించారు.
జీ స్టూడియోస్, డ్యాన్సింగ్ శివ ఫిల్మ్స్, కింగ్స్ మెన్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై సినిమా నిర్మితమైంది. ఈ చిత్రంలో ప్రతీక్ గాంధీ, పత్రలేఖ పాల్ ప్రధాన పాత్రల్లో నటించారు. కుల నిర్మూలన కోసం పూలే చేసిన పోరాటం, మహిళల హక్కుల కోసం ఆయన సాగించిన ఉద్యమాన్ని దర్శకుడు కళ్లకు కట్టినట్టుగా తెరపై ఆవిష్కరించారు. ఈ సందర్బంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతు పూలే సినిమా భారతీయ సమాజానికి అద్భుతమైన సందేశం అందించే చిత్రమని తెలిపారు. ఆ నాడు కుల వివక్షను తట్టుకుని సమ సమాజం కోసం వేసిన పునాదుల ఫలితాలను ఈరోజు అనుభవిస్తున్నామని తెలిపారు. పూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని పేర్కొన్నారు