టెంపో డ్రైవర్ టు...శంఖ్ ఎయిర్ ఓనర్ వరకూ
posted on Jan 5, 2026 8:19PM
.webp)
ఇటీవల కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడుతో ఫోటోలు దిగారు శంఖ్ ఎయిర్ వ్యవస్థాపకుడు శ్రవణ్ కుమార్. దీంతో ఈయన దేశ వ్యాప్తంగా వైరల్ అవుతున్నారు. ఒక టెంపో డ్రైవర్ స్థాయి నుంచి విమానయాన సంస్థ ఓనర్ వరకూ ఎలా ఎదిగాడన్నదే ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న.
మధ్య తరగతి విమాన యాన కలను ఎలాగైనా సరే సాకారం చేయాలన్న దృక్పథంతో శ్రవణ్ ఈ రంగంలో అడుగు పెట్టినట్టు చెబుతున్నారు. యూపీ నుంచి వస్తోన్న తొలి విమానయాన సంస్థను ప్రారంభించారు. శ్రవణ్ తొలుత సిమెంట్, స్టీల్, రవాణా రంగాల్లో వ్యాపారాలు చేశారు. 2026లో దేశీయ విమాన సేవలు ప్రారంభించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు శ్రవణ్.
శ్రవణ్ విశ్వకర్మ నేపథ్యం ఏంటో చూస్తే సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు. చిన్నతనంలోనే చదువుకు విరామం ప్రకటించి టెంపో నడపటం స్టార్ట్ చేశారు. తొలుత లోడర్ గా తన కెరీర్ మొదలు పెట్టారు శ్రవణ్. ఆ తర్వాత అంచలంచెలుగా ఎదిగి రవాణా నుంచి స్టీల్ కి ఆపై సిమెంట్, మైనింగ్ రంగాల్లో విజయవంతమైన వ్యాపార నిర్వహణ చేశారు.
శ్రవణ్ చిన్నప్పటి కల విమానయానం. దీంతో ఈ రంగంలో అడుగు పెట్టి శంఖ్ ఎయిర్ ప్రారంభించారు. దీని ప్రధాన లక్ష్యం.. మిడిల్ క్లాస్ కి అందుబాటులో ఉండేలాంటి ధరలు. సామాన్యులు కూడా ఎంతో సాదా సీదాగా విమానయానం చేసేయ్యడమే శ్రవణ్ తన ముందు పెట్టుకున్న టార్గెట్. తొలిగా మూడు ఎయిర్ బస్సులతో శ్రవణ్ తన శంఖ్ ఎయిర్ ని ప్రారంభించారు. లక్నో, ఢిల్లీ, ముంబై వంటి నగరాలను కనెక్ట్ చేయడం, పండుగల సమయంలో కూడా ధరలు పెరగకుండా చూసుకోవడం. తన ప్రయారిటీస్ గా పెట్టుకుందీ సంస్థ.
ఇదంతా ఇలా ఉంటే ఇలాంటి విమాన యాన సంస్థలు ఎన్నో పుటకు రావల్సిన అవసరం కనిపిస్తోంది.. కారణం మొన్నటి ఇండిగో వ్యవహారం చూస్తూనే ఉన్నాం. ఈ సంస్థ గుత్తాధిపత్యం కారణంగా దేశమే స్తంభించి పోయిన పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి.. యువ కేంద్ర మంత్రి తెలుగు తేజమైన రామ్మోహన నాయుడి అధ్వర్యంలో శ్రవణ్ లాంటి మరి కొందరు ఈ రంగంలోకి రావాలని ఆశిద్దాం. ఆల్ ద బెస్ట్ టు శంఖ్ ఎయిర్- శ్రవణ్ అంటూ ఆల్ ఓవర్ ఇండియా కూడా ఆయనకు శుభాకాంక్షలు చెబుతోన్న విధం కనిపిస్తోంది.