చివరికి మిగిలేది?
posted on Feb 23, 2022 9:30AM
బాలాస్తావతీ క్రీడాసక్తః
తరుణస్తావత్తరుణీసక్తః |
వృద్ధస్తావాచ్చింతాసక్తః
పరమే బ్రహ్మణి కో పి సక్తః
భావం: మానవుడు - బాలుడుగా ఉన్నప్పుడు ఆటపాటల మీద ఆసక్తి కలిగి ఉంటాడు, యౌవనం లో స్త్రీల పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు, వృద్ధాప్యంలో చింతలతో సతమతం అవుతుంటాడు. కానీ ఆ పరమాత్మ యందు ఆసక్తిని చూపే వారెవరూ లేరు కదా!!!
వయసి గతే కః కామవికారః
శుష్కే నీరే కః కాసారః |
క్షీణే విత్తే కః పరివారః
జ్ఞాతే తత్వే కః సంసారః
భావం: వయస్సు మళ్ళిపోతే కా మవికారాలుండవు. నీరంతా ఇంకిపోయిన తర్వాత సరస్సు ఉండదు. డబ్బు పోయిన తర్వాత పరిచారకులు ఉండరు. అలాగే ఆత్మజ్ఞానం తెలిసి అజ్ఞానం తొలగిపోతే ఇక ఈ జనన మరణ రూప సంసారం అనేది ఉండదు. భజ గోవిందం లోని ఈ రెండు శ్లోకాలు నాకు కాలగమనము యొక్క ప్రాముఖ్యత నేర్పిస్తూ ఉంటాయి. నిజమే కదా ఈ వయస్సు అన్నది శాశ్వతం కాదు. బాల్య వయసులో మనం ఆటల్లో గడిపేస్తాం. కొద్దిగా యవ్వనం లోకి రాగానే మన మనసుకు నచ్చిన వారితో సంసార సాగరంలో పడిపోతాము. మళ్లీ ముసలి వయసు రాగానే ఈ జబ్బులు ఆ జబ్బులతో ఒళ్లంతా రోగాలు మయం చేసుకుని, మనకు పాడి కట్టే రోజు కోసం రోజులు లెక్కపెట్టుకుంటూ ఉంటాము.
ఇదేనా జీవితం అంటే? నాకైతే ఇంతకుమించి ఏదో ఉంది అనిపిస్తుంది. మనం జీవితంలో ఎన్ని సాధించినా ఎంత గొప్ప స్థాయికి చేరుకున్న చివరికి చేరాల్సింది ఈ మట్టిలోనే. ఈ మట్టిలో కలిసిపోయే దేహం కోసం ఎన్నో మారణహోమాలు, ఎన్నో దుర్మార్గాలు, మరెన్నో అవినీతి కార్యాలలో, చేతకాని వారిగా భాగస్వాములమవుతాం లేదా అటువంటి వారిని చూస్తూ చేతలుడిగి కూర్చుంటాము.
నిజానికి చివరికి మిగిలేది అనేది మనం ఎవరము ఆలోచించము కదా. ఎవరో మహానుభావుడు చెప్పినట్టు మనిషి చావు అనేదే లేనట్టు బతుకుతాడు కానీ ఎన్నడూ బతక లేనట్టు చస్తాడు. ఇది నిజం కాదంటారా?
దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్నట్టు మనకు సమయం ఉండగానే మనం మనతోపాటు చివరి క్షణాల్లో మనకు అండగా వచ్చే వాటిని తీసుకుపోవాలి మరి మనకు అండగా వచ్చేదేంటి? ధర్మరాజుకున్నంత ధర్మాన్ని మనం పాటించలేము. ఈ కాలంలో అది అసలు కుదరని పని. కానీ కొంతలో కొంతైనా మనం ధర్మం పక్షాన నిలబడలేమా? చివరికి మనతోపాటు కొన్ని ఆత్మీయ అనుభూతులను మోసుకెళ్లలేమా?
మన ఊపిరి వదిలే ప్రతి క్షణాన్ని చివరి క్షణంగా ఆస్వాదిస్తూ, మనతోపాటు పయనం చేస్తున్న సమస్త జీవరాశిని ప్రేమిస్తూ సాధ్యమైనంతలో సేవ చేస్తూ, బతికితే అదే చాలు ఈ జీవితానికి. ఏముందిలే ఇంకా నాకు బోలెడంత వయసు ఉంది. తీర్ధయాత్రలవీ చేసుకుని బోలెడంత పుణ్యం సంపాదించేసుకుంటాను అనే భ్రమను వదిలి ఈ క్షణమే ఆఖరి క్షణం అన్నట్టు బతుకు నావను ఈశ్వరునికి అంకితం చేసేద్దాం.
మనం చనిపోయినప్పుడు మన కోసం ఏడ్చే కళ్ళు లేకున్నా పర్వాలేదు కానీ వీడు పోయి భూమికి భారం తగ్గింది అనుకుని నవ్వే పెదవులు ఉండకూడదు.
వెంకటేష్ పువ్వాడ