వ్యాయామం అలవాటుగా మారితే...
posted on Mar 4, 2022 9:30AM
రోజంతా సుదీర్ఘంగా పనిచేశాక మన శరీరాన్ని వ్యాయామం చెయ్యడానికి ఒప్పించడం అంత తేలికైన పనికాదు. మనసులో వ్యాయామం చెయ్యాలని ఎంతగా ఉన్నా శరీరం అందుకు సహకరించదు. కానీ క్రమం తప్పకుండా వ్యాయామం చేసే కొంతమంది మాత్రం అదేదో ట్రిక్ ప్లే చేసినట్లు ఠంచనుగా చేసేస్తుంటారు. బహుశా, వాళ్లు కూడా ఆ విషయాన్ని గుర్తించకపోవచ్చు. వ్యాయామాన్ని ఒక నిర్దిష్టమైన అలవాటుగా చేసుకున్నవాళ్లు మాత్రమే క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తారని హెల్త్ సైకాలజీ అనే పత్రికలో ప్రచురించిన ఒక అధ్యయనం తెలిపింది.
పొద్దున అలారం మోగితే ఎలా లేస్తామో, అలా పొద్దున్నే సంకేతం అందినట్లుగా లేచి, మరో ఆలోచన లేకుండా వ్యాయామంలోకి వాళ్లు దిగిపోతారు. అలాగే ఆఫీసు పని తర్వాత వెళ్తే కలిగే లాభనష్టాల గురించిన ఆలోచన లేకుండా వాళ్లు జిమ్‌కు వెళ్లిపోతుంటారు. ఎందుకంటే అది వాళ్లలోని అంతర్గత సంకేతాల ద్వారా ప్రేరేపితమైన స్వతంత్ర నిర్ణయం. మరికొంతమంది వ్యాయామాన్ని రొటీన్ వ్యవహారమన్నట్లు చేసుకుంటూ పోతారు.
ప్రేరణతో కూడిన అలవాటు మంచిదా, లేక వేరే రకమైన ఎగ్జిక్యూషన్ హ్యాబిట్ మంచిదా అనే విషయం తెలుసుకోవడానికి వ్యాయామం చేసేవాళ్లపై నెల రోజుల పాటు అధ్యయనం చేశారు పరిశోధకులు. ఈ అధ్యయనం కోసం యూనివర్సిటీ విద్యార్థుల్ని, బోధనా సిబ్బందిని వారు ఎంచుకున్నారు. ఎన్నో ప్రశ్నలు వేసి వారి దగ్గర్నుంచి సమాచారం రాబట్టారు. ఎంత తరచుగా వ్యాయామం చేస్తుంటారు? మీ వ్యాయామ అలవాటు ఎంత బలమైంది? వేరు ఆలోచనలు లేకుండా వ్యాయామం చేస్తున్నారా?.. లాంటి ప్రశ్నలతో వారి అలవాటును అంచనా వేయడానికి ప్రయత్నించారు. జిమ్‌లో ఎలాంటి వ్యాయామాలు చేస్తారు? ఒత్తిడిలో ఉన్నప్పుడు కూడా రెగ్యులర్‌గా చేసే వ్యాయామాలన్నీ తప్పకుండా చేస్తుంటారా?.. అనే ప్రశ్నలకు సమాధానాలు రాబట్టారు.
వీటి ఆధారంగా వాళ్లలోని అలవాటు ప్రేరణతో కూడినదా, లేక 'చేయాలి కాబట్టి చేస్తున్నాం' అనే భావనతో కూడినదా అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. దీర్ఘ కాలంలో ఒక వ్యక్తి ఎంత తరచుగా వ్యాయామం చేస్తారనే విషయాన్ని ఊహించేందుకు ఉపయోగపడ్డ ఒకే ఒక అంశం, ప్రేరణతో కూడిన అలవాటు బలమే.
కాలంతో పాటు వాళ్లల్లో వ్యాయామ అలవాటు కూడా బలపడింది. "ప్రేరణతో కూడిన అలవాటు కలిగినవాళ్లు ఒక నెలరోజుల పాటు తరచుగా వ్యాయామం చేస్తూ చురుగ్గా తయారయ్యాక, వాళ్ల అలవాటు మరింత బలాన్ని పుంజుకోవడం నేను గమనించాను. అదే నిర్వాహక హాబీ కలిగినవాళ్లలో అయితే ఎలాంటి మార్పూ కనిపించలేదు." అని పరిశోధకుల్లో ఒకరైన ఎన్. అలీసన్ ఫిలిప్స్ తెలిపారు. ఒకే రకమైన వ్యాయామాలపై దృష్టి పెట్టడం అనేది మానసికంగా ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపలేదు కానీ, ఒక వ్యక్తి ఒక నియమావళికి కట్టుబడి ఉండటానికి కూడా ఇది దోహదం చేయలేదు. రోజూ పొద్దున, సాయంత్రం ఒకే రకమైన పనులు చేస్తూ విసుగు చెందుతూ కొత్తగా కసరత్తులు మొదలుపెట్టినవాళ్లకు ఇది శుభవార్తే.
"ఎప్పటికప్పుడు వైవిధ్యమైన వ్యాయామాలు చేస్తుండటం దీర్ఘకాలంలో ఉపయోగకరమైందే తప్ప హానికరం కాదు. చాలామంది వ్యాయామం మొదలుపెట్టడాన్ని ఎప్పటికప్పుడు వాయిదా వేస్తుంటారు. ఎందుకంటే, వాళ్లకు వ్యాయామం ఒక పెద్ద భూతంలా కనిపిస్తుంటుంది. ఒకసారి పట్టుకుంటే ఇక అది మనల్ని వదలదేమోనని భయపడుతుంటారు. వాళ్లకు ట్రెడ్‌మిల్ మీద పరిగెత్తడం అనేది చాలా బోరింగ్ రొటీన్. అదో హింసలాగా కనిపించి, వ్యాయామాన్ని ప్రారంభించకుండానే దాన్ని ముగించేస్తుంటారు." అని చెప్పారు ఫిలిప్స్.
కొన్ని అంశాలు పదే పదే పునరావృతం అవుతూ వ్యాయామం చెయ్యాలనే సంకల్పాన్ని బలోపేతం చేస్తాయి. "మీరు ఒక నిర్దిష్ట వ్యాయామాన్ని వృద్ధి చేసుకుంటున్నప్పుడు, మీతో సరిపోయే భావజాలం కలిగినవాళ్లతో ఉండటం మీకు తోడ్పాటునిస్తుంది. అయితే ఏదో ఒకే రకమైన వ్యాయామానికి అలవాటుపడ్డం విసుగు పుట్టిస్తుంది. అందువల్ల అంతర్గత సంకేతాలకు తగ్గట్లు చేయడమే మంచిది. అదే మిమ్మల్ని మళ్లీ మళ్లీ మీ ఎక్సర్‌సైజ్ రొటీన్ వైపు మళ్లిస్తుంటుంది." అంటారు ఫిలిప్స్.