ఎలాంటి ధైర్యం కావాలి?
posted on Aug 16, 2021 9:30AM
గాంధీజీకి, సుభాష్ చంద్రబోస్ కి చాలా ధైర్యం. బ్రిటిష్ వాళ్లను ఎదిరించి పోరాడి స్వాతంత్రం సిద్ధింపచేశారు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని మన దేశం నుండి వెళ్లగొట్టారు.. మరి ధైర్యం అనేది మంచిదే కదా అనుకుంటున్నారా? కానీ ఒసామా బిన్ లాడెన్ హిట్లర్ లాంటి వాళ్లను గమనిస్తే, ఇలాంటి వాళ్లకు కూడా చాలా ధైర్యం ఉంది. కానీ వాళ్ల వల్ల దేశానికి అప్రతిష్ఠ వచ్చింది. ఎన్నో మారణహోమాలు చేశారు. ఎందరో కన్నీటికి కారణమయ్యారు. మరి అలాంటి ధైర్యం మంచిదా? అసలు ధైర్యం అంటే ఏంటి??
మీరు ఒక ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్నారు. ఆఫీస్ కి టైం అవుతుంది. దాంతో మీరు సిగ్నల్ క్రాస్ చేసి పోలీస్ ముందు నుండి వెళ్లిపోయారు. మీరు చాలా ధైర్యవంతులు. మీరు ఇంకొక సందర్భంలో అర్ధరాత్రి ఎవరు లేని సమయంలో కూడా రెడ్ లైట్ చూసి దాని అతిక్రమించ లేదు. ఆగి వెళ్లారు. దీనికి కూడా ధైర్యం ఉండాల్సిందే. ఏమంటారు? ఈ రెండు సందర్భాల్లో ఏ సమయంలో మీకు ధైర్యం ఎక్కువగా ఉంది? ఆలోచించి చెప్పండి .. ఎటువంటి ధైర్యం మీకు రాత్రిపూట మనశ్శాంతిగా నిద్రపోయే అవకాశాన్ని ఇస్తుంది? కచ్చితంగా మొదటిది అయితే కాదు.
మీరు ఒక సినిమాకి వెళ్లారు.. అందులో విలన్ కి కూడా ధైర్యం ఉంటుంది. హీరో కూడా చాలా ధైర్యవంతుడు. మీరు ఎవరిని ఆదర్శంగా తీసుకుంటారు హీరోనా ?విలనా? ఖచ్చితంగా హీరోయే అందరికీ నచ్చుతాడు అవునా? ఒక్కోసారి మనం నో అని చెప్పడానికి కూడా సంకోచిస్తాము. ఈ మధ్యనే నేను నో చెప్పడం అలవాటు చేసుకున్నాను. ముఖ్యంగా మనకి బాగా పరిచయస్తులకి ,సన్నిహితులకు నో చెప్పడం చాలా కష్టం. వారిని నొప్పించకుండా నో అని చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. నా స్నేహితుడు ఒకరు నాతోపాటు చదువుకుంటాను అని కంబైండ్ స్టడీస్ పేరుతో రోజంతా నాతో గడిపేవాడు. ఆ రోజులో చదువు కన్నా మా మధ్య వేరే సంభాషణలే ఎక్కువగా ఉండేవి. రోజంతా ఇలా గడిపేసాక, అయ్యో అని బాధపడడం తప్ప నేను చేసేది ఏమీ ఉండేది కాదు. అతనికి రావద్దు నన్ను ఒంటరిగా చదువుకోని అని చెప్పాలంటే ఎక్కడ ఫీల్ అవుతుందేమోనని నాలో తెలియని భయం. ఇలా కొన్ని రోజులు గడిచాక నేను అందుకోవలసిన టార్గెట్ అందుకోలేక పోయాను. సిలబస్ కంప్లీట్ అవలేదు. అలాంటప్పుడు ఓ రోజు ధైర్యం చేసి అతనికి రావద్దని మెల్లగా చెప్పాను. అదేంటో అతను కూడా "నేను కూడా అదే అనుకుంటున్నాను. మనిద్దరం కలుస్తుంటే మాటలు ఎక్కువగా దొర్లుతున్నాయి. నేను రాను అని చెప్తే నువ్వు బాధపడతావ్ ఏమోనని చెప్పలేకపోయాను. మనం ఒంటరిగానే చదువుకుందాం. ఆదివారం పూట మనం వారమంతా ఏం చదివామో చర్చించుకుందాం" అని నవ్వుతూ చెప్పి వెళ్ళిపోయింది.
నేను కొద్దిగా ధైర్యం చేసి ఈ విషయం ముందే అతనికి చెప్పి ఉంటే ఇన్ని రోజులు వృధా అయ్యేవి కాదేమో అనిపించింది. మీకు మొదటిసారి సిగరెట్ తాగాలన్నా లిక్కర్ తాగాలన్న ధైర్యం కావాలి. కానీ ఆ ధైర్యమే మీ పతనానికి దారి తీస్తుంది అయితే మీ జీవితాన్ని నిర్మిస్తున్నదో అటువంటి ధైర్యం నీలో పెంపొందించుకోవాలి. కాలేజీ కుర్రాళ్ళ ని చూస్తూ ఉంటాను. అమ్మాయిలను ఏడిపిస్తూ ఉంటారు. బైక్ మీద విన్యాసాలు చేస్తారు పెద్దవాళ్ళను ప్రొఫెసర్లను ఎగతాళి చేస్తారు. వీటన్నిటికి కూడా ధైర్యం కావాలి. కానీ బాధ్యతాయుతమైన ధైర్యం మాత్రం వీళ్లలో మచ్చుకైనా కనిపించదు. ఇటువంటి సాహసపరులలో ఎంతమంది ఇది దేశ రక్షణలో భాగస్వాములై ఒక సైనికుడిలా సన్మార్గంలో నడుస్తారో వేళ్ళతో లెక్కించవచ్చు.
ధైర్యం అంటే భయం లేకుండా ఉండడం కాదు. భయంతో పాటు పయనించడం. మీరు కొత్తగా ఆఫీస్ లో చేరారు కొద్దిగా భయం ఉంటుంది అయినా భయాన్ని చిరునవ్వుల దాచేస్తూ మీ కొలీగ్స్ తో సత్ సంబంధాలు ఏర్పరుచుకుని హాయిగా జీవితాన్ని నిర్మించుకుంటున్నారు అంటే మీరు కూడా ధైర్యవంతులే. గొప్ప గొప్ప సాహసాలు చేస్తేనే సాహసవంతులు గారు. మిమ్మల్ని ఎవరూ చూడకపోయినా మీరు మీలా ఉండడానికి ఇష్టపడుతున్నారు అంటే మీరు ధైర్యవంతులు. బాధ్యతాయుతమైన ధైర్యంతో , మీ సాటి వారికి మార్గదర్శనం ఇస్తారో, లేదా బాధ్యత లేని ధైర్యంతో ఒక వార్నింగ్ లాగా మిగులుతారో మీరే నిర్ణయించుకోవాలి.
◆ వెంకటేష్ పువ్వాడ