కాంగ్రెస్ అభ్యర్ధి ఎవరు? తెరాస టెన్షన్.. టెన్షన్ 

హుజూరాబాద్  ఉప ఎన్నికే అయినా మరో ఎన్నికే అయినా, ఆ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనేది ఆయా పార్టీలు నిర్ణయించు కుంటాయి.., అలాగే పార్టీ అభ్యర్ధి ఎవరనేది కూడా అంతే పార్టీలే నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంది. అంతే కానీ,  అధికార పార్టీ ఆదేశాల ప్రకారం పార్టీలు పనిచేయవు. అయితే, తెరాస నాయకులు మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిని ప్రకటించదేమని చిరాకు పడుతున్నారు. 


హుజూరాబాద్ ఉప ఎన్నికల విషయంలో కాంగ్రెస్ పార్టీ, వ్యూహం ఏమిటో ఏమో కానీ, ఇంతవరకు ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. అభ్యర్ధిని ప్రకటించ లేదు. అది ఆ పార్టీకి సంబందించిన అతర్గత వ్యవహారం. ప్రతి పార్టీకి, ఆపార్టీ అవసరాల కనుగుణంగా ఒక  వ్యూహం ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి వ్యూహం ఏమిటో ఎందుకు, హుజూరాబాద్’ ఉప ఎన్నికను అంత సీరియస్’గా తీసుకోవడం లేదో  అది ఆ పార్టీకి మాత్రమే సంబందించిన విషయం. 


అయితే, కాంగ్రెస్ అభ్యర్ధిని ప్రకటించకపోవడం విషయంలో కాంగ్రెస్ నాయకుల్లో ఎలాంటి తొందర, ఆతురత  లేదు కానీ,  అధికార తెరాస నాయకులు ఎందుకో తెగ కలవర పడుతున్నారు. నిజమే, హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబందించి అధికార పార్టీ అయిన దానికి కానీ దానికి ఇలాగే కలవర పడుతోంది. తాడును చూసి పామని భయడుతోంది.ఒక విధంగా చూస్తే తెరాస నాయకులు. తమ నీడను చూసి తామే భయపడుతున్నారా, అనిపిస్తోంది.


అయితే, తెరాస కలవరపాటుకు కారణం లేక పోలేదు. హుజూరాబాద్ ఉపేన్నికలలో గెలుపు కోసం అధికార పార్టీ చేయని ప్రయత్నమంటూ ఏదీ లేదు. మంచి చెడు విచక్షణ లేకుండా, అన్ని అస్త్రాలను సంధించింది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని, ప్రజలను అన్ని విధాలా ప్రలోభాలకు గురిచేసింది. ప్రతి దళిత కుటుంబానికి పదిలక్షల రూపాయల వంతున పందారం చేసే, దళిత బంధు పథకాన్ని ప్రకటించింది. అదికూడా  హుజూరాబాద్’ లో గెలిచేందుకే ఈ పథకం అని చెప్పి మరీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఇంతవరకు, దేశంలో ఎప్పుడూ ఎక్కడ ఒక ఉప ఎన్నికలో ఖర్చుచేయనంత నిధులను అధికార పార్టీ ఇప్పటికే ఖర్చు చేసిందని ప్రచారం జరుగుతోంది. ఇంత  చేసినా, అధికార పార్టీని ఓటమి భయం వెంటాడుతోంది. తెరాస ప్రభుత్వం ఎంత చేసినా, ఏమి చేసినా ఈటల పై వేటు వేయడాన్ని,నియోజక వర్గ ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు. ఆ తప్పు ముందు ఇప్పుడు ప్రకటిస్తున్న వరాలు  దిగతుడుపుగానే భావిస్తున్నారు. పార్టీలు, జెండాలతో సంబంధం లేకుండా ఈటల వైపు జనం మొగ్గుచుపుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.


అందుకే, నియోజక వర్గంలో  కాంగ్రెస్  పార్టీకి ఉన్న సంప్రదాయ ఓటు అటు వెళ్ళిపోతే, ప్రభుత వ్యతిరేక ఓటు చీలి, తెరాసకు మేలు జరుగుతుందని ఆ పార్టీ నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు. అందుకే, కాంగ్రెస్ పోటీకి దిగి, గట్టి అభ్యర్ధిని బరిలో దించడమే కాకుండా ఇప్పటినుంచే ప్రచారంలో దిగితే తెరాస గెలుపు అవకాశాలు మెరుగు అవుతాయని ఆ పార్టీ భావిస్తోంది.  అదుకే  బాల్క సుమాన్ వంటి తెరాస నాయకులు పరోక్షంగానే అయినా కాంగ్రెస్ పార్టీ పోటీ విషయంలో, అభ్యర్ధి విషయంలో ఎటూ తేల్చక పోవడం పట్ల అసహనం ప్రకటిస్తున్నారు. బీజేపీని గెలిపించేందుకే కాంగ్రెస్ సైలెంట్‌గా ఉంటోంద‌ని, కాంగ్రెస్, బీజేపీల మధ్య అక్రమ అసంబంధాలను అంట కట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు అయితే ఎలా ఉండేదో ఏమో కానీ, టీపీసీసీ చేఇఫ్ రేవంత్ రెడ్డి, వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఇది తెరాస నాయకులను మరింత అసహనానికి గురి చేస్తోంది. కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.