మూడు వేల రైస్ మిల్లులు మూత? కేసీఆర్ హడావుడి ఢిల్లీ టూర్ ఆంతర్యమిదేనా?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపు లేని వైఖరి ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో ఇప్పుడిప్పుడే నిదానంగా తెలిసొస్తోంది. ఆ పరిణామాల పర్యవసానాలు ముందుగా రైస్ మిల్లర్లు ఎదుర్కోబోతున్నట్టు కేసీఆర్ కు, ఆయన వందిమాగధులకు క్రమంగా బోధపడుతోంది. అందువల్లే అలాంటి ప్రమాదమేదీ ముంచుకు రాకముందే ఢిల్లీలో పనులు చక్కబెట్టుకొని రావాలని కేసీఆర్ కు ఆయన ఆంతరంగికులు హితబోధ చేసినట్టు విశ్వసనీయ సమాచారం. దాని ఫలితమే ఈ నెలలోనే కేసీఆర్ రెండోసారి ఢిల్లీ టూర్ చేస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలోని అగ్రవర్ణాల్లో రెెడ్ల తరువాత ఇంచుమించుగా బ్రాహ్మలతో సమానంగా జనాభా ఉన్న సెక్షన్ వైశ్యులు. రైస్ మిల్లుల్లో అధిక శాతం వీరి అధీనంలోనే ఉన్నాయి. అయితే వచ్చే సీజన్లో బియ్యం కొనుగోళ్లపై ఇటీవల ఎఫ్.సి.ఐ. పరిమితులు విధించడం తెలంగాణలో సర్కారును ఇరుకున పెట్టింది. ఎఫ్.సి.ఐ కేవలం 60 లక్షల టన్నుల మేలురకం వరి ధాన్యాన్ని మాత్రమే కొంటామని, అంతకుమించి కొనుగోలు చేసే సామర్థ్యం లేదని తేల్చి చెప్పింది. ఈ పరిణామంతో రైస్ మిల్లుల నుంచి ప్రభుత్వం మీద తీవ్రమైన ఒత్తిడి పెరిగిందంటున్నారు. 

తెలంగాణలో ప్రస్తుతం దాదాపుగా మూడు వేల రైస్ మిల్లులున్నాయి. వీటిలో కార్మికులుగా, కూలీలుగా, రైస్ మిల్ ఉద్యోగులుగా దాదాపు 2 లక్షల మంది నేరుగా ఉపాధి పొందుతున్నారు. అది కాకుండా ఈ రైస్ మిల్లుల ద్వారా మొత్తం దాదాపు 10 లక్షల మంది ఆధారపడి జీవిస్తున్నారు. తెలంగాణ ఆవిర్భవించాక మిషన్ భగీరథలో భాగంగా సాగునీటి సౌలభ్యత పెంచడం మీదనే కేసీఆర్ అత్యధిక శ్రద్ధ కనబరచారు. మిగతా పనులకు ఆయన పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. అదే ఇప్పుడు కేసీఆర్ ను పునరాలోచనలో పడేసిందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో సాగు విస్తీర్ణాన్ని పెంచిన తరువాత అన్ని రకాల వరి వంగడాల ఉత్పత్తికి తెలంగాణే కేంద్రం అవుతుందని, దేశంలో ఏ రాష్ట్రానికి కావాలన్నా, ప్రపంచంలో ఏ దేశానికి కావాలన్నా అత్యంత నాణ్యమైన వరి వంగడాలు సరఫరా చేసే స్థితిలో తెలంగాణ ఉంటుందని విపరీతమైన హైప్ క్రియేట్ చేశారు. ప్రజలంతా అదే నిజమని నమ్మారు. సాగునీరు కూడా ఎప్పుడూ లేనిరీతిలో అందుబాటులోకి వచ్చిన కారణంగా రైతులంతా వరిసాగునే ఆశ్రయించారు. దీంతో వరి రెట్టింపు ఉత్పత్తిని రికార్డు స్థాయిలో నమోదు చేసింది. రైతులకు శ్రమ ఫలితం దక్కుతుందని ఆశించిన కొన్నిరోజులకే కొనుగోళ్లు చేయలేని పరిస్థితి తలెత్తింది. దీనిపై రైతులంతా గతేడాది ఆందోళనబాట పట్టారు. వెంటనే కేసీఆర్ జోక్యం చేసుకొని రైతుల దగ్గర నుంచి ఆఖరు బియ్యపు గింజ కొనుగోలు చేసే పూచీ తనదని హామీ ఇవ్వాల్సి వచ్చింది. దీంతో గతేడాదే బియ్యం కొనుగోళ్లలో ప్రభుత్వ అశక్తత స్పష్టంగా బయటపడింది. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి తలెత్తకముందే సమస్యను పరిష్కరించాలన్న ఒత్తిడిలో కేసీఆర్ పడిపోయారు. అందుకే ఆఘమేఘాల మీద ఢిల్లీకి పయనమై కేంద్రం పెద్దలను ఒప్పించడమే ఎజెండాగా పెట్టుకున్నట్టు సమాచారం. 

రాష్ట్రంలో ఇప్పటికే వరిసాగు మీద భయాందోళనలు నెలకొన్నాయి. పెరిగిన సాగుభూమిలో వరికాకుండా ఇతర పంటల్ని ప్రోత్సహించాల్సి వస్తోంది. అయితే నీరు ఎక్కువగా వినియోగించుకునే వరికి బదులు అదే భూముల్లో ఇతర పంటలు సాగవుతాయా.. వరి పంట తగ్గితే ఇప్పుడున్న రైస్ మిల్లులను ఏం చేయాలి.. ఒక్కో రైస్ మిల్లు నిర్మాణానికి దాదాపు 15 కోట్ల పెట్టుబడి అవసరం అవుతుంది. వాటి నిర్వహణకు రోజూ దాదాపు రూ. లక్షకు పైగా ఖర్చవుతుంది. ఇంత పెట్టుబడితో ఏర్పాటు చేసిన రైస్ మిల్లులు మూతపడక తప్పదా.. అలాంటి పరిస్థితే ఎదురైతే వాటి మీద ఆధారపడ్డ 10 లక్షల మందికి ఉపాధి ఎలా కల్పించాలి.. ప్రభుత్వ ప్రోత్సాహంతో రైస్ మిల్లులు ఏర్పాటు చేసిన యజమానులకు ఏమని జవాబు చెప్పుకోవాలి... వారికి ప్రత్యామ్నాయం ఎలా చూపించాలి.. ఇలాంటి ప్రశ్నలన్నీ కేసీఆర్ మెదడును తొలుస్తున్నాయని, ఉన్నపళంగా ఈ సమస్యను గనక పరిష్కరించకోపయినట్లయితే తెలంగాణలో ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న వైశ్య సామాజికవర్గం నుంచి పెద్దఎత్తున నిరసన ఎదుర్కోక తప్పదన్న ఆందోళన ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అందుకే రానున్న ఉపద్రవాన్ని నివారించడానికే కేసీఆర్ కేంద్రం పెద్దల్ని ఎలాగైనా ఒప్పించాలన్న దృఢ నిశ్చయంతో ఢిల్లీ టూర్ ఖరారు  చేసుకున్నారన్న టాక్ నడుస్తోంది. మరి ఢిల్లీ నుంచి ఎలాంటి హామీతో తిరిగొస్తారో చూడాలి.