పర్యాటక ప్రియుల కోసం మూడు ప్రదేశాలు!!

 

భగవాన్ రమణ మహర్షి. ఈయన జ్యోతి స్వరూపుడు. ఆధ్యాత్మిక లోకానికి ఉన్న గొప్ప ఉనికిని కొనసాగించిన రమణ మహర్షుల వారు తన జీవితంలో ముఖ్యమైన సంఘటనలను కొన్ని ప్రదేశాల్లో గొప్ప అనుభవాలుగా అనుభూతి చెందారు. అవన్నీ కూడా శివకళలు నిండిన ప్రదేశాలు మరియు గొప్ప శైవ క్షేత్రాలు. విహారాయత్రల మీద ఆసక్తి ఉన్నవారు ఇటువెళ్తే ఎంతో గొప్ప అనుభవం మూటగట్టుకుంటారు.

ఒక్కసారి ఆ శైవక్షేత్రాల గూర్చి చూస్తే… 

1.తిరుచ్చుళి: ఇది భగవాన్ శ్రీరమణ మహర్షి జన్మస్థలం. దీనికి సంస్కృతంలో "త్రిశూలపురం" అని పేరు. దీని మాహాత్మ్యమును స్కంద పురాణంలో వర్ణించారు. మధుర-తిరువనంతపురం రైలు మార్గంలో విరుదనగర్ అనే జంక్షన్ ఉంది.  దానికి తూర్పుదిశలో 18 మైళ్ళ దూరంలో తిరుచ్చుళి వుంది. మధురనుంచి అరుప్పుకోటకు వచ్చి, అక్కడ నుండి తిరుచ్చుళికి  వెళ్ళవచ్చు. మధుర నుండి తిరుచ్చుళికి బస్సు మార్గం ఉంది. ఇక్కడే భగవాన్ రమణ మహర్షి జన్మించారు. ఆయన అలా జన్మించినప్పుడు ఆయన ప్రసవించిన గదిలో ఒక జ్యోతి కనబడిందట. అది ఆ గదిలో ఉన్న ఒక అవ్వకు కనబడిందట. ఆ అవ్వకు చూపు సరిగా కనిపించకపోయినా ఆమె ఆ జ్యోతిని చూసింది అంటే ఆ వెలుగు ఎంత ప్రకాశంగా ఉందొ, రమణుల వారి జననం ఎంత గొప్పదో అర్థమవుతుంది. 

తిరుచ్చుళిలో వెలసిన శివునికి “తిరుమేననాథర్” అని, దేవికి “తుణైమాలె” (సహాయాంబ) అని పేర్లు. వీరిపై సుందరమూర్తి, మాణిక్య వాచకులు ఎన్నో కీర్తనలను కీర్తించారు. ఈ త్రిశూలపురం ఉన్న శివుడిని భూమినాథేశ్వరుడు అని కూడా అంటారు. 


కౌండిన్య ఋషి ఇక్కడ తపస్సు చేయడం వలన ఈ క్షేత్రమునకు “కౌండిన్య క్షేత్రం” అని పేరు వచ్చింది. ఈ ఊరిలో ప్రవహిస్తున్న నదికి కూడా "కౌండిన్య నది" అని పేరు. ఇట్లా రమణులు పుట్టిన ప్రదేశంలో ఎంతో శక్తివంతమైన ఛాయలు ఉన్నాయి. 

2. మధుర: ఇది మీనాక్షీ- సుందరేశ్వరులు వెలసిన క్షేత్రం మరియు పాండ్యుల రాజధాని. రమణ మహర్షి మీనాక్షి అమ్మవారి ఆలయంలోకి వెళ్లిన ప్రతిసారి ఆయనలో ఉన్న ఆత్మ చైతన్యం అయ్యేదని చెబుతారు. ఆధ్యాత్మికంగా అంతవరకు ఎక్కువ ఆసక్తిగా లేని రమణ మహర్షి మీనాక్షి అమ్మవారి ఆలయం వెళ్లిన కొన్ని నెలల తరువాత ఆధ్యాత్మిక బాటలో ప్రయాణించడం జరిగింది.  ఇక్కడ ఈశ్వర విభూతి కార్యమును, సహస్రారంలో కుండలినీ విలాసంగా పోల్చి చెపుతారు. కావున దీనిని “ద్వాదశాంత స్థలి” అని పిలుస్తారు. 

3. అరుణాచలం: అరుణాచలమునే “తిరువణ్ణామలై" అంటారు. ఇక్కడ భగవాన్ 54 సంవత్సరాలు లోకానికి ఆచార్యులుగా వుండి బోధలను అందించారు. తిరుపతి నుంచి వెల్లూరు, వెల్లూరు నుంచి తిరువణ్ణామలైకు బస్సులో వెళ్ళవచ్చు. తిరుపతి నుంచి మధురై వెళ్ళే రైలులో ప్రయాణించి తిరువణ్ణామలైలో దిగవచ్చును. 'కాట్పాడి', తిరువణ్ణామలైకు దగ్గరలోని రైల్వే జంక్షన్. తిరిచ్చుళిలో పుట్టిన వెంకటరామన్ అరుణాచలంకు చేరిన తరువాత కొన్ని సంవత్సరాల తరువాత భగవాన్ రమణ మహర్షిగా రూపుదిద్దుకున్నారు. చివరికి ఆయన మరణించేవరకు అక్కడే ఉన్నారు. జన్మించినప్పుడు ఎలాగైతే జ్యోతి వెలిగిందో,  ఆయన మరణించినప్పుడు  కూడా తోకచుక్క ఆకాశానికేసి వెళ్లిపోయిందని అది ఆయన భక్తులకు కనిపించిందని చెబుతారు. 

నిజానికి ఆదిశంకరుల తరువాత అద్వైతాన్ని గురించి గట్టిగా ప్రపంచానికి వినిపించిన వారు రమణ మహర్షే!! ఈయన ఎవరికీ ఏవిధమైన బోధనలు చేయలేదు. తన జీవితం ద్వారానే ఆదర్శుడిగా నిలిచారు.

ఇట్లా రమణ మహర్షి జీవితంతో అనుబంధమైన ఈ శైవ క్షేత్రాలను చూసొస్తే విహారాయత్ర ముచ్చట, ఇటు ఆధ్యాత్మిక అనుభవం రెండూ కలుగుతాయి.

◆ వెంకటేష్ పువ్వాడ

Online Jyotish
Tone Academy
KidsOne Telugu