ఒప్పుకుంటే సమీకరణ... లేదంటే సేకరణే...

 

నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఇప్పటికే 33వేల ఎకరాలు సమీకరించి శంకుస్థాపన కార్యక్రమం కూడా పూర్తి చేసేసిన ఏపీ ప్రభుత్వం... మరో 3వేల ఎకరాలు సమీకరించాలని చూస్తోంది. నిజానికి మరో పదివేల ఎకరాలు సమీకరించాలని భావించినప్పటికీ రైతులు ముందుకు రాకపోవడంతో మూడు వేల ఎకరాలు మాత్రం కచ్చితంగా తీసుకోవాలని ప్రభుత్వం అడుగులు వేస్తోంది, ముఖ్యంగా సీడ్ కేపిటల్ పరిధిలో ఇంకా భూములివ్వని ఉండవల్లి, పెనుమాక గ్రామాల రైతులను ఒప్పించి భూములు తీసుకోవాలని యోచిస్తోంది.

ఏడాదికి మూడు పంటలు పండే భూములను ఎట్టిపరిస్థితుల్లోనూ ఇచ్చేది లేదని, అయినా ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ సరిపోదని ఉండవల్లి, పెనుమాక రైతులు ఆందోళన బాట పట్టడంతో వాళ్లతో సంప్రదింపులు జరపాలని ప్రభుత్వం డిసైడైంది, ఇప్పటికే అధికారులకు ఆ మేరకు ఆదేశాలిచ్చిన ప్రభుత్వం... భూములు ఇచ్చేందుకు ఒప్పుకోని రైతులకు ప్యాకేజీ పెంచనున్నట్లు సంకేతాలు ఇచ్చింది. ప్యాకేజీ పెంపుపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచనప్రాయంగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గుంటూరు జిల్లా కలెక్టర్ ఈ రెండు గ్రామాల రైతులతో సంప్రదింపులు జరుపుతున్నారు.

అయితే ప్యాకేజీ పెంచినా భూములు ఇవ్వడానికి రైతులు ముందుకు రాకపోతే కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం డిసైడైనట్లు తెలిసింది, సంప్రదింపులు జరిపాక కూడా భూసమీకరణకు ఒప్పుకోని పక్షంలో... చివరిగా భూసేకరణ చట్టాన్ని ప్రయోగించనున్నట్లు తెలుస్తోంది. అయితే భూములివ్వని రైతుల పొలాల్లో పంటలను దుండగులు తగలబెడుతున్న తరుణంలో ప్రభుత్వ ప్యాకేజీకి ఒప్పుకుంటారో లేక భూసేకరణ చట్టాన్ని ప్రయోగించే పరిస్థితి తెచ్చుకుంటారో చూడాలి.