తెలంగాణాలో కూడా కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోతుందా?
posted on Dec 7, 2015 2:40PM
.jpg)
కాంగ్రెస్ నేతలంటే దేశముదురు రాజకీయ నేతలనే నిశ్చితాభిప్రాయం ప్రజలలో నెలకొని ఉంది. వారు ఎంత గడ్డు పరిస్థితులనయినా ఎదుర్కొని బయటపడుతుంటారు. కానీ ఇప్పుడు వాళ్ళందరూ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాలు చూసి హడలిపోతున్నట్లున్నారు. “దానం నాగేందర్ తెరాసలో చేరుతున్నారంటూ ఆ పార్టీ నేతలు ఒక పద్ధతి ప్రకారం ప్రచారం చేస్తూ తమతో మైండ్ గేమ్స్ ఆడుతున్నారని” షబ్బీర్ అలి ఆరోపించడం చూస్తుంటే చాలా నవ్వొస్తోంది.
ఒకానొకపుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా తెరాస నేతలతో రాష్ట్ర విభజన అంశంపై ఇలాగే మైండ్ గేమ్స్ ఆడిన విషయం మరిచిపోయినట్లున్నారు. కానీ అప్పుడు కేసీఆర్, ఇప్పుడు కాంగ్రెస్ నేతల్లాగా అక్రోశించలేదు. పట్టు విడుపులు ప్రదర్శిస్తూ కాంగ్రెస్ పార్టీని చాలా తెలివిగా ఎదుర్కొన్నారు. కాంగ్రెస్ అధిష్టానం తెరాసను తమ పార్టీలో కలిపేసుకొని తెలంగాణాలో దాని ఉనికి లేకుండా చేసేద్దామని అతితెలివి తేటలు ప్రదర్శించి చివరికి చేతులు కాల్చుకొంది. అప్పటి నుండి రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు తెరాసను, దాని వ్యూహాలను ఎదుర్కొనలేక చతికిలపడుతూనే ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఏపీలో ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా రాష్ట్ర విభజన చేసింది కనుక కాంగ్రెస్ పార్టీ అక్కడ నష్టపోయిందని సరిపెట్టుకోవచ్చును. కానీ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని బలిపెట్టుకొని మరీ తెలంగాణా ఏర్పాటు చేసినప్పటికీ తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు దెబ్బతింది? దెబ్బతిన్నా మళ్ళీ ఎందుకు కోలుకోలేకపోతోంది? అంటే కేసీఆర్ ధాటికి తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నేతలు తట్టుకోలేకపోవడం వలననేనని అర్ధమవుతోంది. షబ్బీర్ అలీ ఆవేదనలో అదే కనబడుతోంది.
అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి వారయినా గొప్పగానే కనిపించవచ్చును. కానీ ఇటువంటి క్లిష్ట పరిస్థితులు ఎదురయినప్పుడే సామర్ధ్యం నిరూపించుకోవలసి ఉంటుంది. కానీ షబ్బీర్ ఆలీ వంటి ఎంతో సీనియర్ నేత తెరాసతో తమతో మైండ్ గేమ్స్ ఆడుతోందని వాపోవడం చూస్తుంటే చాలా నవ్వు వస్తోంది. కాంగ్రెస్ పార్టీ తనను తాను స్వయంగా ఓడించుకొన్నప్పుడే వేరే పార్టీలు అధికారంలోకి వస్తుంటాయని, లేకుంటే ఏ ఇతర పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీని ఓడించే శక్తి లేదని అని కాంగ్రెస్ నేతలు గొప్పగా చెప్పుకొంటుంటారు. ఇప్పుడు దానినే తిరగేసి చెప్పుకోవాలేమో? ఏ ఇతర పార్టీ అయినా దానంతట అదే ఓడిపోతే తప్ప కాంగ్రెస్ పార్టీ తనంతట తానుగా గెలవలేదని చెప్పుకోవాలేమో?ఒకవేళ ఆ సత్తా ఉన్నట్లయితే జి.హెచ్.ఎం.సి.ఎన్నికలలో దానిని నిరూపించి చూపుకొనే అవకాశం దాని ఎదురుగా ఉంది.