మీరొస్తామంటే....మేము వద్దంటామా..?

 

ఇదేదో సినిమా పాటకి పేరడీ కాదు. తెలంగాణా ఐటి మరియు పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కె. తారక రామారావు చెప్పిన మాటలు. దేని గురించి అంటే...ఇతర పార్టీలలో నుండి తెరాసలోకి రావాలనుకొంటున్న నేతల గురించి. సచివాలయంలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెపుతూ, “ఇతర పార్టీల ఎమ్మెల్యేలని బలవంతంగా మా పార్టీలో చేర్చుకోవడానికి వాళ్లేమయినా చిన్న పిల్లాలా? ఒక్కొక్కళ్ళు నాలుగయిదుసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన రాజకీయ అనుభవం ఉన్నవ్వాళ్ళు. వాళ్ళకి ఏది మంచో ఏది చెడో ఎవరయినా చెప్పాలా? వాళ్ళని మా పార్టీలో చేర్చుకోవడానికి మేము ఎటువంటి ఆఫర్లు ఇవ్వడం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి ఆకర్షితులయ్యి చాలా మంది మా పార్టీలో చేరుతున్నారు. వాళ్ళు వస్తామంటే మేము వద్దంటామా? ఎంతమంది వచ్చినా మా తలుపులు తెరిచే ఉంటాయి. మా పార్టీ ఆశయాలకి, సిద్దాంతాలకి అనుగుణంగా పనిచేయగాలమని భావించేవారందరికీ మేము స్వాగతం చెపుతాము,” అని కేటీఆర్ అన్నారు.

 

జి.హెచ్.ఎం.సి. ఎన్నికలతో తెలంగాణాలో ప్రజలు ఏ పార్టీని ఆదరిస్తున్నారో దేనిని తిరస్కరిస్తున్నారో స్పష్టం అవుతుందని అన్నారు. ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం చాలా పనులు చేపట్టిందని వాటిని ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారని కేటీఆర్ అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu