ఎంసెట్ పరీక్షలు వాయిదా

తెలంగాణలో  ఎంసెట్‌ పరీక్షలు వాయిదా  పడ్డాయి. కరోనా ఉధృతి తగ్గనందున పరీక్షలను వాయిదా వేయాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం జూలై 5, 6 తేదీల్లో ఎంసెట్‌ మెడికల్‌.. 7, 8, 9 తేదీల్లో ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్ష జరగాల్సి ఉంది. అయితే మే2 నుంచి జరగాల్సిన ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు వాయిదాపడటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సెకండియర్‌ పరీక్షలను జూలై 15 తర్వాత నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించిన తేదీలను ప్రకటించాల్సి ఉంది. ఇంటర్‌ ద్వితీయ సంవత్సర పరీక్ష తేదీలు ఖరారైన తర్వాత ఎంసెట్‌ తాజా షెడ్యూల్‌ను ప్రకటిస్తామని తెలంగాణ ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు ఆచార్య తుమ్మల పాపిరెడ్డి వెల్లడించారు..

ఇక వెనుకబడిన, సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాలకు  జరగనున్న టీజీసెట్‌ ప్రవేశపరీక్ష వాయిదా పడింది. ఈ పరీక్ష ఆదివారం జరగాల్సి ఉంది. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో పరీక్షను వాయిదా వేశామని, తదుపరి తేదీని తర్వాత ప్రకటిస్తామని టీజీ సెట్‌ కన్వీనర్‌, సాంఘిక, గిరిజన గురుకులాల విద్యాసంస్థల కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu