సైకిలు జోరు.. కారు బేజారు!

అవును, రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో తెలుగు దేశం పార్టీ, గత వైభవాన్ని కోల్పోయింది. అది నిజం. తెలుగుదేశం అంటే ఏపీ పార్టీ అనే ముద్ర పడింది. ముఖ్యంగా, తెలంగాణ సెంటిమెంట్ ను సొంతం చేసుకున్న బీఆర్ఎస్(అప్పుడు టీఆర్ఎస్) అధినేత ముఖ్యమంత్రి కేసేఆర్ అదే సెంటిమెంట్ ను అస్త్రంగా చేసుకుని, రాజకీయ శక్తుల పునరేకీకరణ పేరిట  ప్రత్యర్ధి పార్టీలను ముఖ్యంగా కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీలను నిర్వీర్యం చేసేందుకు వ్యూహాత్మకంగా పావులు కదిపారు. 

రాష్ట్ర విభజన నేపధ్యంగా జరిగిన 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో అధికారంలోకి  వచ్చిన తెలుగు దేశం పార్టీ తెలంగాణలోనూ సత్తా చాటింది. తెలంగాణ తెచ్చామనే ఊపులో ఉన్న తెరాస (ఇప్పటి బీఆర్ఎస్)ను, తెలంగాణను ఇచ్చామన్న ధీమాతో ఉన్న కాంగ్రెస్ దూకుడును ఎదుర్కుని కూడా 14.7 శాతం ఓట్లతో  15 సీట్లు గెలుచుకుంది. అయితే, ఆ తర్వాత అతికొద్ది కాలానికే, టీడీపీ ఎమ్మెల్యేలు క్యూ కట్టి కారెక్కారు.గులాబీ గూటికి చేరారు.

2018 ముందస్తు ఎన్నికల నాటికి ఒకరో ఇద్దరో ఎమ్మెల్యేలు మాత్రమే టీడీపీకి మిగిలారు. ఇక ఆ తర్వాత ఏంజరిగిందనేది చరిత్ర. 2014 బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ, 2018లో తెలంగాణలో కాంగ్రెస్, సిపిఐతో కలిసి పోటీచేసింది. అయినా, టీడీపీ కేవలం రెండంటే రెండే సీట్లు గెలుచుకుంది. అలాగే ఓటు షేర్ 15 శాతం నుంచి మూడున్నర శాతానికి పడిపోయింది. అంతే కాదు, టీడీపీ టికెట్ పై గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా కారెక్కి గులాబీ గూటికి చేరుకున్నారు. అలాగే, పార్టీ రాష్ట అధ్యక్షుడు ఎల్.రమణ సహా సీనియర్ నాయకులు చాలామంది అధికార పార్టీలోకి దూకేశారు. మరి కొందరు బీజేపీలోకి జంపయ్యారు. 

ఇది చరిత్ర..ఎవరూ కాదనలేని నిజం. అయితే, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు,శాశ్వత శత్రువులే కాదు, శాశ్వత బాహుబలులు కూడా ఉండరు. ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి. ఎదురు లేదు, తిరుగు లేదనుకున్న పార్టీ నాయకులు అనూహ్యంగా బొక్కబోర్లా పడతారు. కానీ, ఒకసారి బొక్కబోర్లా పడినంత మాత్రాన, అంతటితో ఆపార్టీ పనై పోయింది అనుకోవడం అయితే అజ్ఞానం, లేకుంటే అహంకారం, అదీ కాదంటే అమాయకత్వం అనిపించుకుంటుంది. పడి లేచిన కెరటంలా, రాజకీయాల్లోనూ పనైపోయింది అనుకున్న పార్టీలు రెట్టింపు బలంతో అధికారంలోకి వచ్చిన సందర్భాలు చరిత్రలోనే కాదు, నడుస్తున్న చరిత్రలోనూ నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఒకప్పుడు రెండంటే రెండు లోక్ సభ స్థానాలున్న బీజేపీ ఈరోజు 303 స్థానాలకు చేరుకుంది. 

సరే, అదలా ఉంచి  అసలు విషయంలోకి వస్తే, తెలంగాణలో పనైపోయింది అనుకున్న తెలుగు దేశం పార్టీ ఇప్పుడు సెంటిమెంట్ బలంతో తిరుగులేదనుకున్న బీఆర్ఎస్  అదినేత ముఖ్యమంత్రి కేసీఆర్ కు చెక్ పెట్టడమే కాకుండా. ఆయనలో ఓటమి భయం పుట్టించింది. ఉద్దేశం ఏదైనా కావచ్చు తెలంగాణ సెంటిమెంట్  అండగా రాజకీయంగా ఎదిగిన కేసీఆర్  జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ కోసం అదే తెలంగాణ సెంటిమెంట్ ను స్వహస్తాలతో తుడిచేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగామార్చారు. నిజానికి కేసీఆర్  2014 ఎన్నికల ఫలితాలు వచ్చిన గంటల  వ్యవధిలోనే, తెరాస ఇక ఉద్యమ పార్టీ కాదు, ఫక్తు పదహారణాల రాజకీయ పార్టీ అని ప్రకటించారు.ఆ దిశగానే ఆయన ప్రయాణం ప్రారంభించారు. ఉద్యమ ఆనవాళ్ళను తుడిచేశారు. రాజకీయ పునరేకీకరణ అనే ముద్దు పేరుతొ  తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిబ జేఏసీ చైర్మన్ కొదండరామ్  సహా ముఖ్యనేతలు అందరిని ‘సగౌరవం’గా పార్టీ నుంచి సాగనంపారు. అదే  సమయంలో ఆ ముందు రోజు వరకు ఉద్యమ  ద్రోహులుగా, తెలంగాణ ద్రోహులుగా తామే నిందించిన తలసాని మొదలు సబితా ఇందర రెడ్డి వంటి వారిని  మంత్రిపదవులతో అందలం ఎక్కించారు. అలాగే, తెరాసను కుటుంబ పార్టీగా, తెలంగాణను కుటుంబ సామ్రాజ్యంగా మార్చేశారు. 

అయితే తానొకటి తలిస్తే దేవుడి ఇంకొకటి తలిచాడు అన్నట్లుగా, కేసీఆర్  ఉద్దేశం ఏదైనా జాతీయ రాజకీయాలు అసలుకే మోసం తెచ్చాయి. ముఖ్యంగా 2018 అంతగా బలంగా లేని బీజేపీ, 2019 లోక్ సభ ఎన్నికల నాటికి పుంజుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక్క సీటుకు పరిమితమైన బీజేపీ, లోక్ సభ ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాలు గెలుచుకుంది. ఇక  అక్కడి నుంచి బీజేపీ దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికల ద్వారా, ఒక రాజకీయ శక్తిగా ఎదిగింది. అలాగే, మొదటి నుంచి బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ రెంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తర్వాత మరింతగా పుంజుకుంది. .బీజేపీ, కాంగ్రెస్ లలో ఎవరిది పైచేయి అనేది అటూ ఇటూ ఉగుతున్నా, చివరకు రాష్ట్రంలో ముక్కోణపు పోటీ అనివార్యంగా మారింది. 
ఈ నేపద్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరేడు మాసాల క్రితం ఖమ్మం సభతో పూరించి శంఖారవం ఇప్పడు తెలంగాణ అన్ని జిల్లాలలో మారు మోగుతోంది.

చంద్రబాబు నాయుడు తెలంగాణపై దృష్టి పెట్టడంతో, బీఆర్ఎస్ లో  భయం పట్టుకుంది. చంద్రబాబు వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులు, కేసీఆర్ గుడ్నేల్లో రైళ్ళు పరిగెతిస్తున్నాయి. నిజానికి, టీడీపీ రేసులో నిలిస్తే, కాంగ్రెస్ బీజేపీలకంటే తెలుగు దేశం పార్టీనే  బీఆర్ఎస్ ను బలగా దెబ్బతీస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే సైకిల్ జోరు పెరుగుతుంటే కారు బేజారౌతోందని అంటున్నారు.  అందుకే కేసీఆర్, ఏపీ వైపు కన్నెత్తి చూడడానికి కూడా భయపడుతున్నారని చెబుతున్నారు.