పవన్‌కళ్యాణ్, హరీష్‌శంకర్ కాంబినేషన్‌లో మరో ‘కెవ్వుకేక..’!
on Jul 14, 2025
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందిన ‘గబ్బర్‌సింగ్’ ఎంతటి బ్లాక్‌బస్టర్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాలో పవన్‌కళ్యాణ్ పెర్‌ఫార్మెన్స్, డైలాగ్స్ విపరీతంగా పాపులర్ అయ్యాయి. ఈ సినిమాలోని ఐటమ్ సాంగ్ ‘కెవ్వు కేక..’కి ఎంత క్రేజ్ వచ్చిందో చూశాం. మలైకా అరోరాపై చిత్రీకరించిన ఈ పాట యూత్‌ని ఉర్రూతలూగించింది. ఇప్పుడు పవన్‌కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ కూడా ఓ ఐటమ్‌ని పెట్టబోతున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పవన్‌కళ్యాణ్ చేస్తున్న సినిమాల వరసలో ‘హరిహర వీరమల్లు’ తర్వాత ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు.
ఇప్పటికే ‘ఉస్తాద్ భగత్‌సింగ్’కి సంబంధించిన షూటింగ్ కొంత భాగం పూర్తయింది. ఇటీవలే బ్యాలెన్స్ వర్క్ కూడా పూర్తి చేసేందుకు పవన్ ఓకే చెప్పారని తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ‘గబ్బర్‌సింగ్’ చిత్రం మ్యూజికల్‌గా బ్లాక్‌బస్టర్ అయిన విషయం తెలిసిందే. దాన్ని మించే స్థాయిలో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ చిత్రం మ్యూజిక్ ఉండాలన్న ఉద్దేశంతో దేవిశ్రీప్రసాద్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ‘గబ్బర్‌సింగ్’లోని ‘కెవ్వు కేక..’ సాంగ్ తరహాలోనే ‘ఉస్తాద్ భగత్‌సింగ్’లో కూడా ఒక పాటను ప్లాన్ చేస్తున్నారట. అయితే ఆ పాట ఎలా ఉండబోతోంది, ఎవరిపైన ఆ పాటను చిత్రీకరిస్తారు అనే విషయాలు తెలియాల్సి ఉంది.
తమిళ్‌లో సూపర్‌హిట్ అయిన ‘తెరి’ చిత్రాన్ని తెలుగులో ‘పోలీసోడు’ పేరుతో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు పవన్‌కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ ఆ చిత్రానికి రీమేక్ అని ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని ఈ సినిమాకి స్క్రీన్‌ప్లే అందిస్తున్న దశరథ్ ఓ సందర్భంలో తెలిపారు. అయితే ఆ సినిమా మూలకథను మాత్రమే తీసుకొని పవన్‌కళ్యాణ్ ఇమేజ్‌కి తగ్గట్టుగా, తెలుగు నేటివిటీకి అనుగుణంగా కథలో మార్పులు, చేర్పులు చేశారట. ఒకవిధంగా చూస్తే ఇది కొత్త కథగానే భావించాల్సి ఉంటుంది. పవన్‌కళ్యాణ్ అభిమానిగా ‘గబ్బర్‌సింగ్’ చిత్రాన్ని ఒక రేంజ్‌లో తెరకెక్కించిన హరీశ్‌శంకర్.. ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ చిత్రాన్ని మరింత ఎఫెక్టివ్‌గా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఈ సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ కోసం ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నట్టు తెలుస్తోంది.
ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘హరిహర వీరమల్లు’ ఎట్టకేలకు జూలై 24న విడుదల కాబోతోంది. అలాగే సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఓజి’ చిత్రం కూడా సెప్టెంబర్ 25న రిలీజ్‌కి సిద్ధమవుతోంది. అంటే ఈ ఏడాది పవర్‌స్టార్ నటించిన రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇక ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ చిత్రాన్ని వచ్చే ఏడాది రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు. మరి ఈ మూడు సినిమాలతో పవన్‌కళ్యాణ్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



