బాబు ఇంటి నిర్మాణానికి అనుమతులివ్వని సర్కార్
posted on Jun 11, 2023 9:24AM
ఓ సామాన్యుడు ఇంటి నిర్మాణం అనుమతి కోసం పంచాయతీ లేదా మున్సిపాలిటీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకొంటే.. వారం.. పది రోజులు.. మహా అయితే నెల రోజులు పడుతోంది. అంతేకానీ.. అనుమతులు మంజూరు చేయడానికి నెలలకు నెలలు అయితే పట్టదు కదా. కానీ టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకొని నెలలు గడుస్తున్నా.. అధికారుల నుంచి నేటికి స్పందన లేకపోవడం గమనార్హం.
చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కుప్పం. సదరు నియోజకవర్గంలో ఇంటి నిర్మాణం కోసం చంద్రబాబు దరఖాస్తు చేసుకొన్నారు. ఆయన దరఖాస్తు చేసుకొని ఆరు నెలలు గడిచినా.. నేటికి మున్సిపల్ అధికారులు అనుమతులు మంజూరు చేయకపోవడంతో... అధికారుల నిర్లక్ష్య వైఖరిపై విసిగిపోయిన ఆయన.. న్యాయవాదుల ద్వారా సదరు అధికారులకు నోటీసులు పంపినట్లు సమాచారం.
కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం కడపల్లె వద్ద జాతీయ రహదారిని అనుకొని ఉన్న 99.77 సెంట్ల విస్తీర్ణం గల స్థలాన్ని చంద్రబాబు కొనుగోలు చేశారు. ఆ స్థలంలో ఇంటి నిర్మాణం కోసం.. ఆయన భూమి పూజ సైతం నిర్వహించారు. ఎన్నికల లోపు.. ఇంటి నిర్మాణం పూర్తి చేయాలని ఆయన సంకల్పించారు. కానీ ఇంటి నిర్మాణానికి అధికారులు అనుమతులు ఇవ్వకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో నోటీసులు పంపినట్లు సమాచారం. అయితే తమ పార్టీ అదినేత చంద్రబాబు నాయుడు ఇంటి నిర్మాణంపై అధికారులు అనుసరిస్తున్న వైఖరిపై స్థానిక టీడీపీ శ్రేణులు మండిపడుతోన్నాయి.
ఈ జగన్ పాలనలో ఉమ్మడి రాష్ట్రానికే కాదు.. నవ్యంధ్రకు సైతం ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబుకు ఇటువంటి పరిస్థితి ఎదురైతే.. సామాన్యుడి పరిస్థితి ఏమిటని సదరు పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. రాష్ట్రంలో ఎవరికైనా సమస్యలు ఉంటే.. ప్రతీ సోమవారం స్పందన కార్యక్రమం ఉంటుందని.. ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులకు వినతి పత్రం ఇస్తే.. సదరు సమస్య.. వెంటనే పరిష్కారమవుతోందంటూ.. ఈ ఫ్యాన్ పార్టీ సర్కార్ అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో తెగ ఊదరగొడుతోందని ఈ సందర్బంగా గుర్తు చేస్తున్నాయి.
అదీకాక.. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే నాటి ప్రతిపక్షనేత వైయస్ జగన్.. తాడేపల్లిలో నివాసం నిర్మించుకొన్నారని.. వారు గుర్తు చేస్తున్నారు. నేడు జగన్ చేసినట్లు.. నాడు తమ పార్టీ అధినేత చంద్రబాబు చేసి ఉంటే.. తాడేపల్లి ప్యాలెస్ నిర్మాణం సజావుగా సాగేదా అని పార్టీ శ్రేణులు సూటిగా అధికార పార్టీని నిలదీస్తున్నాయి.