తమిళ సినీ పాలి"ట్రిక్స్"

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ఓ రేంజ్‌లో పెరిగిపోతోంది. రాజకీయ పార్టీల సమీకరణలు, పొత్తులు, సర్వేలు ఇలా అన్ని కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే అన్నిపార్టీలు మేనిఫేస్టోలు విడుదల చేసి ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే తమిళ తంబీలను పోలింగ్ బూత్‌ల దాకా రప్పించే సత్తా మేనిఫేస్టోలకు, సంక్షేమ పథకాలకు లేదు. ఆ పవర్ ఒక్క సినీ తారలకే సొంతం. తమిళనాడు రాజకీయాల్లో సినీ తారల పాత్ర అత్యంత కీలకం. అటు లోక్‌సభ, ఇటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ నటీనటులు ప్రచారం చేయడం అనవాతీగా వస్తోంది. ఈ సారి కూడా ఆ రాష్ట్ర రాజకీయాలను సినీ గ్లామర్ ప్రభావితం చేయబోతోంది. దీంతో సినీ ప్రపంచాన్ని తమ సొంతం చేసుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు ప్రణాళికలు రచిస్తున్నాయి.

 

తమిళ రాజకీయ రంగం, సినీ రంగం వేరు వేరు కాదు. దశాబ్దాలుగా ఈ రెండు విడదీయరానంతగా పెనవేసుకుపోయాయి. డీఎంకే వ్యవస్థాపకుడు అన్నాదురై మొదలుకుని కరుణానిధి, ఎంజీ రామచంద్రన్, శివాజీ గణేశన్, జానకీ రామచంద్రన్, జయలలిత సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారే. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోయినా రజనీకాంత్, కమల్‌హాసన్, కుష్బూ వంటి వారు దశాబ్ధాలుగా తమిళ రాజకీయాలను శాసిస్తున్నారు.

 

రాజకీయ నాయకులు చేసే ఊకదంపుడు ఉపన్యాసాలు వినాలంటే ప్రజలకు ఎంత ఓపిక కావాలి. అందుకే ప్రచార సభల్లో సంస్కృతిక కార్యక్రమాలు, మ్యూజికల్ నైట్స్ ఏర్పాటు చేసి జనాలను కదలకుండా ఉంచుతారు. ఎన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నా సినీ గ్లామర్ ముందు దిగదుడుపే. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కదలివచ్చినా జనాల నుంచి రెస్సాన్స్ అంతంత మాత్రమే. అదే ఒక నటుడు కాని నటి కాని వచ్చి చెయ్యి ఊపితే వచ్చే రెస్పాన్సే వేరు. అందుకే తమిళ రాజకీయల్లో హీరోలకు , హీరోయిన్లకు అంత డిమాండ్.

 

డీఎంకే వ్యవస్థాపకుడు స్వర్గీయ అన్నాదురై స్వయంగా రచయిత.. రంగస్థలం, సినిమాలల్లో తన పెన్ పవర్ చూపించారు. ఆయన తర్వాత పార్టీని నడిపిస్తున్న కరుణానిధి కూడా రచయితగా, నిర్మాతగా సినిమాతో బంధం ఉన్నవారే. అలాగే అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్ హీరోగా తమిళ సినీ రంగాన్ని శాసించి ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ప్రజల అభిమానాన్ని పొందారు. ఎంజీఆర్ తర్వాత ఆ పార్టీ పగ్గాలు చేపట్టిన జయలలిత సౌతిండియన్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన హీరోయిన్. తమిళ సినిమా దిగ్గజం శివాజీ గణేషన్ కాంగ్రెస్‌కు ప్రచారం చేశారు. డీఎండీకే అధినేత విజయకాంత్ తన మార్క్ చిత్రాలతో ప్రజలను రంజింపచేశారు. 2006లో రాజకీయాల్లోకి వచ్చిన కెప్టెన్, డీఎండీకే పార్టీని స్ధాపించి ప్రతిపక్ష హోదా దక్కించుకున్నారు.

 

ఇక ఈ ఏడాది ఎన్నికల్లో అన్నాడీఎంకే తరపున ఏకైక స్టార్ కాంపెయినర్ అధినేత్రి జయలలితే. ఆమెకు తోడుగా నటులు రామరాజన్, పొన్నాంబళం, సెంథిల్, సీఆర్ సరస్వతి, వింధ్య తదితరులున్నారు. డీఎంకే తరపున వాగై చంద్రశేఖర్, కుమారి ముత్తు, వాసువిక్రం, తదితరులున్నారు, ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే హీరోయిన్లు కుష్బూ, నగ్మా ప్రచారంలో దూకనున్నారు. ఎటోచ్చి బీజేపీకి ఏ హీరో/ హీరోయిన్ దొరకలేదు. యంగ్ హీరో విశాల్‌ను ఈ ఎన్నికల్లో పోటీచేయడానికి ఒప్పించాలని ప్రయత్నిస్తోంది కమలం. విశాల్ ఇటీవలే నడిగర సంఘం ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి పాపులర్ అయిపోయారు. విశాల్ పోటీకి ఒప్పుకోకపోయినా కనీసం ప్రచారానికైనా రావాలని బీజేపీ గట్టిగా కోరుతోంది. మరి ఎన్నికల ప్రచార రణరంగంలో ఏ స్టార్ స్టామినా ఎంటో త్వరలో తెలిసిపోతుంది.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu