టీడీపీలో అసంతృప్తులను "సంతృప్తి" పరచేందుకు జగన్ స్కెచ్

posted on: May 9, 2016 12:18PM

 

తెలుగుదేశం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకు విలవిలలాడుతున్నారు జగన్. అయిన వాళ్లు, నమ్మినవాళ్లు నట్టేట ముంచుతుంటే క్రుంగిపోతున్నారు. రోజుకొక ఎమ్మెల్యే పార్టీని వీడుతుంటే ఎం చేయాలో తెలియని దిక్కు తోచని స్థితిలోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ఆకర్ష్‌కు వ్యతిరేకంగా వికర్ష్‌ను ప్రయోగించాలని జగన్ ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీలోని అసంతృప్తి నేతలను జగన్ టార్గెట్ చేశారు. వైసీపీ ఎమ్మెల్యేల రాకను తొలి నుంచి వ్యతిరేకిస్తున్న నేతలతో జట్టు కట్టేందుకు జగన్ మంత్రాంగం రచిస్తున్నారు. టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ వల్ల పెద్ద ఎత్తున వైసీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీలోకి వెళ్లారు. ఈ ఎమ్మెల్యేల రాకవల్ల అప్పటికే స్థానికంగా ఉన్న తెలుగు తమ్ముళ్లకు పెద్ద దెబ్బ తగులుతోంది. వలస నేతలకు , స్థానిక నేతలకు మధ్య సఖ్యత కుదరడం లేదన్న కథనాలు మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.

 

ఉదాహరణకు కర్నూలు జిల్లాలో భూమా నాగిరెడ్డి, ఆయన కూతురు అఖిలప్రియ టీడీపీలో చేరడంతో స్థానికంగా ఉన్న టీడీపీ నేత శిల్పామోహన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పైగా వీరిద్దరి వైరం గురించి రాష్ట్రం మొత్తం తెలుసు. టీడీపీలోకి వచ్చిన మరుసటి రోజే శిల్పా అనుచరుడు తులసీరెడ్డిపై దాడి జరిగింది. ఈ దాడి వెనుక భూమా ఉన్నారని శిల్పా వాదించాడు. వీరి పంచాయతీ చంద్రబాబు నాయుడి దాకా వెళ్లింది. అదే కర్నూలు జిల్లాకి చెందిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి టీడీపీలో చేరడంతో అక్కడ స్థానిక నేత, ఎమ్మెల్సీ శిల్పా చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏరాసు ప్రతాపరెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.  

 

ఇక కడప జిల్లాకు వస్తే జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేరికతో అక్కడ స్థానికంగా ఉన్న టీడీపీ నేత, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డికి మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి. ఏకంగా ప్రెస్‌మీట్ పెట్టిమరి ఇద్దరు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ తెలుగుదేశంలో చేరడాన్ని తొలి నుంచి వ్యతిరేకిస్తున్న మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ ఇప్పుడు వైసీపీలోకి చేరారు. అదే విధంగా ప్రకాశం జిల్లాలో అద్దంకి ఎమ్మెల్యేల గొట్టిపాటి రవికుమార్ త్వరలోనే టీడీపీలో చేరారు. ఆయన చేరిక సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను పార్టీ సీనియర్ నేత కరణం బలరాం అనుచరులు చించివేశారని ఆరోపణలున్నాయి. గొట్టిపాటి రాకను చివరి వరకు వ్యతిరేకించిన కరణం అధినేత ఆదేశంతో వెనక్కి తగ్గారు. ఇలా వైసీపీ ఎమ్మెల్యేలు చేరిన ప్రతిచోట టీడీపీలో కలహాలు, గ్రూపు తగదాలు భగ్గుమంటున్నాయి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా..ప్రతి చోట అసంతృప్తుల రచ్చ అధినేత తలబొప్పికట్టిస్తున్నాయి. ఎవరికి సర్దిచెప్పాలో తెలియక ఆయన సతమతమవుతున్నారు. 

 

ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు జగన్ పావులు కదుపుతున్నారు. టీడీపీని అదే రూటులో దెబ్బ తీయాలని..పార్టీ నుంచి పోయిన ఎమ్మెల్యేలకు గట్టి బుద్ధి చెప్పాలంటే, టీడీపీలో వారి రాక వల్ల అసంతృప్తితో ఉన్న నేతలను తమవైపుకు తిప్పుకోవాలని వైసీపీ అధినేత స్కెచ్ గీస్తున్నారు. వీరందరికి వచ్చే ఎన్నికల్లో టికెట్ గ్యారెంటీ హామీతో ఎర వేసి వాళ్లను వైసీపీలోకి లాగాలని పార్టీ అధినాయకత్వం యోచిస్తోంది. అయితే టీడీపీలో ఇతర పార్టీల నుంచి వచ్చే నేతల వల్ల పార్టీలో ఇప్పటికే ఉన్న స్థానిక నేతల నుంచి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. మరి జగన్ ప్లాన్ వర్కవుటవుతుందా..? చంద్రబాబు అంతవరకు రానిస్తారా అన్నది వేచి చూడాలి?

 

 

 

google-ad-img
    Related Sigment News
    • Loading...