చంద్రులకు ఉత్తరాఖండ్ షాక్..

ఉత్తరాఖండ్‌ రాజకీయ సంక్షోభం తెలుగు రాష్ట్రాలపై పెను ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. గడచిన రెండు సంవత్సరాలుగా ఇటు తెలంగాణలోనూ, అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను తమ పార్టీల్లోకి చేర్చుకునేందుకు ఇద్దరు ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబునాయుడులు స్వయంగా రంగంలోకి దిగారు. తెలంగాణలో కేసీఆర్ దెబ్బకి టీడీపీ, వైసీపీలకు కోలుకొలేని దెబ్బ తగిలింది. ఎన్నికల్లో 15 మంది ఎమ్మెల్యేలను గెలుచుకున్న టీడీపీ ప్రస్తుతం కేవలం మూడుకు పడిపోయింది. అదే విధంగా నలుగురు ఎంఎల్‌ఏలు, ఒక ఎంపీని గెలుచుకున్న వైసీపీకి ఆ సంతోషం లేకుండా చేశారు కేసీఆర్. మొత్తం వైసీపీ తరపున గెలిచిన వారందరిని విడతల వారీగా టీఆర్ఎస్‌లో చేర్చుకున్నారు. కాంగ్రెస్ నుంచి కూడా నలుగురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరారు. ఫిరాయింపులే అనైతికమని అనుకుంటున్న సమయంలో రెండు పార్టీలు టీఆర్ఎస్‌లో విలినం అయినట్లు స్పీకర్ ప్రకటించడం మరింత ఆశ్చర్యం. ఈ విలీనం కేసీఆర్ కనుసన్నల్లోనే జరిగిందన్నది బహిరంగ రహస్యం. ఎందుకంటే స్పీకర్ మధుసూదనాచారి టీఆర్ఎస్ సభ్యుడు.

 

మరో వైపు ఆంధ్రప్రదేశ్‌లో అధికార తెలుగుదేశం పార్టీ కూడా ప్రతిపక్ష వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకుంటోంది. తెలంగాణలో టీఆర్ఎస్ తమ పట్ల వ్యవహరించిన విధంగానే ఏపీలో వైసీపీ పట్ల టీడీపీ వ్యవహరిస్తోంది. ఏపీలో తమకు ప్రతిపక్షం లేకుండా చేయాలని టీడీపీ పావులు కదుపుతోంది.  67 మంది ఎమ్మెల్యేలున్న వైసీపీ ఫిరాయింపుల పుణ్యమా అని 51కి పడిపోయింది. రెండు రాష్ట్రాల్లోనూ అధికార పక్షాల తీరుపై ప్రతిపక్షాలు ఎన్నిసార్లు స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా లాభం లేదు. స్పీకర్ల వల్ల ఎలాంటి న్యాయం జరగదని గుర్తించిన ప్రతిపక్షాలు న్యాయస్థానం మెట్లు తొక్కాయి.

 

ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్‌లో తాజాగా ఫిరాయింపు ఎంఎల్‌ఏల విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. బలనిరూపణ సమయంలో ఫిరాయింపులకు పాల్పడిన ఏడుగురు కాంగ్రెస్ శాసనసభ్యులను ఓటింగ్‌కు దూరంగా ఉంచాలంటూ సుప్రీం ఆ రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ను ఆదేశించింది. ఈ తీర్పుతో తెలుగు ప్రభుత్వాలు ఉలిక్కిపడ్డాయి. ఉత్తరాఖండ్ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునే ఉమ్మడి హైకోర్టు ఇస్తే టీఆర్ఎస్, టీడీపీల పరిస్థితి ఏంటీ? డబ్బు కోసమో, పదవుల కోసమో పార్టీలు మారిన వారి పరిస్థితి ఏంటీ? న్యాయస్థానం గనుక అనర్హత వేటు వేస్తే ఈ ఎమ్మెల్యేలంతా ఎటూ కాకుండా పోతారు. దాంతో ఉన్నది పోయే ఉంచుకున్నది పాయే అన్నట్లవుతుంది వీళ్ల పరిస్థితి. ఇక మీదట ప్రభుత్వాధినేతలు కూడా ఎమ్మెల్యేలను చేర్చుకోవాలంటే ఏం ఆశచూపుతారు. మొత్తానికి ఉత్తరాఖండ్ సంక్షోభం అధికార పక్షాల్లో గుబులును, ప్రతిపక్షాలకు కాస్త ఉపశమనాన్ని ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu