వీధికుక్కల దాడిలో విదేశీ కోచ్ కు గాయాలు
posted on Oct 4, 2025 12:49PM

దేశంలో మరీ ముఖ్యంగా దేశరాజధాని నగరంలో వీధికుక్కల బెడద మరో సారి దేశ వ్యాప్తంగా చర్చకు వచ్చింది. ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో విదేశీ కోచ్ లపై వీధికుక్కలు దాడి చేసి గాయపరిచాయి. ఆ స్టేడియంలో పారా అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీలు జరుగుతున్నాయి. ఈ టోర్నీలో పాల్గొనేందుకు కెన్యా కుచెందిన కోచ్ పై స్టేడియం ప్రాంగణంలో వీధికుక్కలు దాడి చేశాయి.
దీంతో ఈ టోర్నీలో పాల్గొనేందుకు వచ్చిన అథ్లెట్లు, సహాయక సిబ్బంది భద్రతపై సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది. కెన్యా స్ప్రింట్స్ కోచ్ డెన్నిస్ మరాగియా మ్వాన్జో శుక్రవారం (అక్టోబర్ 3) ఉదయం వార్మప్ ట్రాక్‌పై తమ అథ్లెట్లకు శిక్షణ ఇస్తుండగా వీధికుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ దాడిలో ఓ కుక్క కోచ్ కులికాలి పిక్కపై గట్టిగా కరిచింది.
అక్కడే ఉన్న మెడికల్ టీమ్ స్పందించి ఆయనకు ప్రథమ చికిత్స అందించిన అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆయనను సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనకు యాంటీ-రేబిస్ వ్యాక్సిన్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. అయితే పటిష్ఠ భద్రత ఉన్న స్టేడియం ప్రాంగణంలోనే వీధికుక్కలు ఓ విదేశీ కోచ్ పై దాడి చేసి గాయపరిచన సంఘటన భీతిగొల్పుతోందని పారా అథ్లెట్లు అంటున్నారు. ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.