కొండాపూర్ లో కూల్చివేతలు.. ఆక్రమణలను తొలగించిన హైడ్రా
posted on Oct 4, 2025 12:29PM

హైడ్రా ఆక్రమణలపై మరోసారి కొరడా ఝుళిపించింది. కొండాపూర్ లోని 36 ఎకరాల ప్రభుత్వ భూమిలోని ఆక్రమణలను తొలగించింది. కొండాపూర్ లోని ఆర్టీఏ కార్యాలయం పక్కన భిక్షపతి నగర్‌లోని ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకుని కొందరు షెడ్లు వేసి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. వీరంతా చిరు వ్యాపారులే అయినా.. వారు ఆక్రమించి షెడ్లు వేసుకున్న భూమి విలువ 3600 కోట్ల రూపాయలకు పైనే ఉంటుందని అంచనా. హైడ్రా సిబ్బంది శనివారం ఈ ఆక్రమణలను తొలగించారు.
వ్యాపారులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసిన అధికారులు, వారిని భూమి ఖాళీ చేయమని ఆదేశించారు. కూల్చివేతల సమయంలో ఎవరూ అడ్డు రాకుండా ఆ ప్రదేశానికి రెండు కిలోమీటర్ల దూరంలో బ్యారికేడ్లు నిర్మించి నిలిపివేశారు. ఈ స్థలంపై కోర్టు వివాదాలన్నీ తేలిపోయి.. ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావడంతో హైడ్రా శనివారం ఆక్రమణలను తొలగించింది.