అవినీతి కేసులో శ్రీలంక మాజీ క్రికెటర్ అర్జున రణతుంగ
posted on Dec 16, 2025 8:40AM

అద్భుత క్రికెటర్ గా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ అవినీతి కేసులో అడ్డంగా బుక్కైయ్యాడు. 1996లో శ్రీలంక వరల్డ్ కప్ విజయంలో రణతుంగది కీలక పాత్ర. వరల్డ్ కప్ గెలిచిన జట్టుకు కెప్టెన్ అయిన రణతుంగ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తరువాత రాజకీయాలలోకి ప్రవేశించారు. రణతుంగ పెట్రోలియం శాఖ మంత్రిగా ఉన్న సమయంలో పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఈ ఆరోపణలపైనే ఆయనపై కేసు నమోదైంది. అరెస్టుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న రణతుంగ స్వదేశానికి తిరిగి రాగానే అరెస్టయ్యే అవకాశాలు ఉన్నాయి.
కేసు వివరాల్లోకి వెడితే 2017లో రణతుంగ పెట్రోలియం మంత్రిగా ఉండగా, ఆయన సోదరుడు ధమ్మిక రణతుంగ ప్రభుత్వ రంగ సంస్థ అయిన సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ ఛైర్మన్‌గా పని చేశారు. ఆ సమయంలో దీర్ఘకాలిక చమురు కొనుగోలు ఒప్పందాల నిబంధనలను ఉల్లంఘించి అధిక ధరకు స్పాట్ పద్ధతిలో కొనుగోళ్లు జరిపారనీ, దీనితో ప్రభుత్వానికి దాదాపు 23.5 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని దర్యాప్తు సంస్థ తేల్చింది.ఈ కేసులో ఇప్పటికే రణతుంగ సోదరుడు ధమ్మికను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన బెయిలుపై ఉన్నారు.