మహాత్మా గాంధీ అంటే మోదీకి నచ్చదు...అందుకే పేరు మార్పు : రాహుల్
posted on Dec 16, 2025 4:20PM
.webp)
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరు మార్చడంపై దేశ వ్యాప్తంగా నిరసనలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చాంది. డిసెంబర్ 17న అన్ని జిల్లా కేంద్రాలలో ధర్నా చేపట్టాలని ఆ పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌ఛార్జీ కేసీ వేణుగోపాల్ తెలిపారు. డిసెంబర్ 28న భారత జాతీయ కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్బంగా పార్టీ కార్యకర్తలు ప్రతి మండలం, గ్రామంలో గాంధీజీ చిత్రపటాలను పట్టుకుని నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ యాక్ట్ పేరు మార్చడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రధాని మోదీకి గాంధీ ఆలోచనలు, పేదల హక్కులు రెండు నచ్చవని అందుకే ఈ పేరు మార్పు కార్యక్రమం అని విమర్శించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మహాత్మాగాంధీ పేరును తొలగించడంపై పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీలు నిరసన తెలిపారు. ఈ పథకం ద్వారా ప్రజలకు మంచి చేయాల్సిన అవసరం ఉందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. 2005లో పథకాన్ని ప్రవేశపెట్టినపుడు అది కేవలం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మాత్రమే. 2009లో కాంగ్రెస్ రెండోసారి అధికారానికి వచ్చిన తర్వాత పథకంలో కొన్ని మార్పులు చేశారు. ఆ సందర్భంగానే మహాత్మాగాంధీ పేరును పథకానికి చేర్చారు.