టీచర్ పెళ్ళికి కట్నం ఎంతో తెలీయదు గానీ.. ఫైన్ మాత్రం రూ. 2 లక్షలు..
posted on May 29, 2021 9:43AM
ప్రభుత్వం కరోనా నిబంధనలు ఉలంగిస్తే ఫైన్ పడుతుంది. కరోనా సమయంలో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల నిర్వహణపై ప్రభుత్వాలు కఠిన నిబంధలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కోవిడ్ రూల్స్ బ్రేక్ చేస్తే కేసులు నమోదు చేయడంతో పాటు కేసులు నమోదు చేసి అరెస్టులు కూడా చేస్తున్నారు. ఇక ఈ కేసులు, ఫైన్ లు ఎవరికి వర్తిస్తుంది అనేది, కొనే కొన్ని కొన్నే సార్లు అక్కడ డ్యూటీలో ఉన్న పోలీస్ మూడును బట్టికూడా ఉంటుంది. లేదంటే రిలేషన్ బట్టికూడా ఉంటుంది. ఇక కరోనా నిబంధనల్లో మొదటిది మాస్క్ లేకుంటే, అనవసరంగా బయటికి వస్తే ఫైన్, ఇలా ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ దొరికితే అక్కడ ట్రాఫిక్ ఫైన్ కంటే కరోనా ఫైన్స్ ఎక్కువగా ఉన్నాయి. అయితే వీటిపైనే కరోనా నిబంధనల ఫైన్ కాదు. పెళ్లిళ్ల పైన కూడా విధిస్తున్నారు.. ఆ విషయం అందరికి తెలిసిందే. అయినా ఏముంది. ఫైన్ అంటే ఐదు వందలు, వేయి రూపాయలు, పది వేలు అనుకుంటున్నారా.. అలా అనుకుంటే మీరు కూడా కరోనా మీద కాలువేసినట్టే, తాజాగా ఆ పెళ్లి కొడుకు కట్టిన ఫైన్ తో మరో పెళ్లి చేయొచ్చు.. ఇంతకీ ఆ ఫైన్ ఎంతనుకుంటున్నారా.. అక్షరాల రెండు లక్షలు, అయితే ఇంకెందుకు ఆలస్యం పదండి ముందుకి మిడత విషయాలు తెలుసుకుందాం..
అది శ్రీకాకుళం జిల్లా. పాతపట్నం మండలం. చంద్రయ్యపేట గ్రామానికి చెందిన టీచర్ రాంబాబు తన పెళ్లి నిమిత్తం పాతపట్నం తహసీల్దార్ వద్ద పర్మిషన్ తీసుకున్నారు. పర్మిషన్ ఇచ్చే సమయంలో తహసీల్దార్ కరోనా నిబంధనలను రాంబాబుకు వివరించాడు. అయితే ఏ వేడుకలైనా తప్పనిసరిగా స్థానిక తహసీల్దార్ అనుమతి తీసుకోవాలని ప్రభుత్వాలు సర్క్యులర్‌లో పేర్కొంటున్నాయి. లాక్‌డౌన్‌లో చేసుకునే పెళ్లిళ్లకు 20 మందికి మించి హాజరు కాకూడదన్న నిబంధన ఉండటంతో ధనవంతులు కూడా నిరాడంబరంగా వివాహాలు చేసుకుంటున్నారు.
అయితే చాలామంది ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. అలాంటి వారిపై పోలీసులు, రెవెన్యూ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. జరిమానా విధించడంతో పాటు కేసులు నమోదు చేసి నిర్వాహకులను అరెస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి ఘనంగా పెళ్లి వేడుక నిర్వహించినందుకు అధికారులు ఈ టీచర్ కి ఏకంగా రూ.2లక్షల ఫైన్ విధించారు. ఆ వేడుకలో 20 కాదు.. 50 కాదు.. ఏకంగా 250 మంది అతిథులు ఉన్నట్లు గుర్తించి అధికారులు షాకయ్యారు. దీంతో కరోనా నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను రాంబాబుకు రూ.2లక్షల జరిమానా విధించారు. దీంతో అధికారుల కళ్లుగప్పి ఘనంగా పెళ్లి చేసుకోవాలనుకున్న రాంబాబుకు వారు విధించిన జరిమానా చూసి కోమాలోకి వెళ్లినంత పనైంది. కరోనా తీవ్రత అధికంగా ఉన్న సమయంలో ప్రజలు పరిస్థితిని అర్థం చేసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.