గూడు చెదిరి.. గుండె పగిలి! ఈ పాపం ఎవరిది? జగనన్న సాయమేది? 

ఎటు చూసినా నీటిలో మునిగిన ఇళ్లు.. గుప్పెడు మెతుకుల కోసం ఎదురు ఆశగా ఎదురుచూసే జనం.. కళ్ళ ముందే కూలిపోతున్న నివాసాలు.. వరదలో కొట్టుకుపోతున్న శవాలు.. ఏ కంట చూసినా కన్నీరే... ఇది ఆంధ్రప్రదేశ్లోని ఓ ప్రాంతం దుర్భర పరిస్థితి.. వరుణ దేవుడి ఆగ్రహానికి వేలాది కుటుంబాలు వీధిన పడ్డాయి. కళ్లముందే కలల సౌధాలు నేల కూలినా.. సాయం కోసం ఎదురు చూడటమే తప్ప ఏమీ చేయలేని ఆ అభాగ్యుల బాధ అంతా ఇంతా కాదు.

రాయలసీమ ప్రాంతం రతనాల సీమగా పేరుగాంచింది. అలాంటి ప్రాంతం ఇప్పుడు వరద దెబ్బతో సహాయం చేసే చేతుల కోసం ఎదురు చూస్తోంది. వరసగా వచ్చిన మూడు తుఫాన్లతో సామాన్య ప్రజల జీవనం శాపంగా మారింది. పెన్నా పరీవాహక ప్రాంతాలలోని ప్రజలు బిక్కు బిక్కుమంటూ బతుకులు ఈడ్చుకొస్తున్నారు. పది రోజులుగా సాయం కోసం ఎదురు చూస్తున్నారు. కళ్ల ముందే వరదలో ఎన్నో ఇళ్లు కూలిపోయాయి. వేలాది ఇళ్లు నీటిలో మునిగిపోయాయి. ఎంతోమంది వరద నీటిలో కొట్టుకుపోయారు. ఇవన్నీ కళ్ల ముందే జరుగుతున్నా ఏమీ చేయలేని దీనస్థితి రాయలసీమ ప్రాంత వాసులది. ఆస్తులు సహా అన్నీ కోల్పోయిన వారు తమ ఆకలి కాస్త ఎవరైనా తీరిస్తే చాలంటూ సాయం చేసే చేతుల కోసం ఎదురు చూస్తున్నారు. రాయలసీమలో ఎప్పుడో.. 1991 లో ఇలాంటి వరదలు వచ్చాయి.  ముప్పై ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ ఇంత బీభత్సం సృష్టించాయి.

ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, పంట నష్టం అంచనాలకే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సమయం సరిపోతోంది. తాత్కాలిక ఉపశమనానికి కూడా ప్రభుత్వ సాయం పూర్తిస్థాయిలో అందడం లేదు. దీంతో వరద బాధితులకు స్వచ్ఛందంగా సాయం అందించేందుకు కొందరు ముందుకొస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో వరద బాధితుల పట్ల రియల్ హీరో సొనూ సూద్  తన వంతు సాయం అందిస్తున్నారు. వరద బాధితులకు తక్షణం ఆర్థిక సాయం అందించాల్సిన కేంద్రంగా నష్ట పరిహారం అంచనాలు వేస్తూ కాలయాపన చేస్తోంది. రాష్ట్ర మంత్రులు, అధికారుల పర్యటనలు వరద బాధితులకు ఏమాత్రం ఊరట ఇవ్వడం లేదు.

పట్టెడన్నం కోసం ఇంకా చాలా మంది వరద బాధితులు ఎదురు చూపులు చూస్తున్నారు. వరద ముంచుకొచ్చి ఇప్పటికే పది రోజులకు  పైగా గడిచింది.. ఇంకా ఎన్నాళ్ళు వానకు తడిసి.. వరదలను తట్టుకుని ఉండాలో అర్ధం కాని పరిస్థితి బాధితులది. చాలా ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు వచ్చి పూర్తిగా ఆస్తి నష్టం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కొన్ని ప్రాంతాలలో వరద నీరు ఇళ్లలోకి రావడంతో ఆగ్రహంతో వర్షంలో కూడా బాధితులు నిరసనలకు దిగుతున్నారు.

రాయలసీమ ప్రాంతంలోని కడప, చిత్తూరు, అనంతరం జిల్లాలతో పాటు కోస్తా ఆంధ్రలోని నెల్లూరులో ఎక్కువగా వరద ప్రభావం పడింది. ఆయా జిల్లాల్లో జనజీవనాన్ని పూర్తిగా అస్తవ్యస్థం చేసింది. కడప, నెల్లూరు జిల్లాల్లోనే సుమారు నాలుగు వేల కోట్లకు పైగా ఆస్తి, పంట, రోడ్లు, రైల్వే లైన్లకు నష్టం వాటిల్లినట్లు అంచనాలు వస్తున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలు, వ్యవసాయ అధికారులు ఇంత వరకు వరద నష్టాన్ని అంచనా వేయలేకపోవడం గమనార్హం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వరద విపత్తు కింద కొన్ని నిధులు తక్షణ మే కేటాయించి ఆదుకోక పొతే ఇప్పటి వరకు జరిగిన ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా  అదే స్థాయిలో జరిగిందని చెప్పుకోవాల్సిన దుస్థితి వస్తుందని జనం భయపడుతున్నారు. 

ఈ పాపం ఎవరిది?
వర్షాలు వస్తాయని, ఊహించని స్థాయిలో భారీ నుండి అతి భారీ వర్షాలు వస్తాయని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించింది. అయినా అధికారులు ఆదమరిచారు. మొదట తుపాన్ వచ్చినప్పుడు శ్రీశైలం, సోమశిల, కండలేరు జలాశయాలకు భారీగా వరద నీరు చేరింది. అప్పటికే వాగులు, వంకలు, చెరువులు, పిల్లకాల్వలతో సహా నిండిపోయాయి. రెండో తుపాన్ ఇంకా బలంగా ఉంటుందని వాతావరణ శాఖ చెప్పింది. కానీ నీటిపారుదల శాఖ అధికారుల మొద్దు నిద్ర, పేద ప్రజలకు శాపంగా మారింది. అప్పటికే జలాశయాలలో ఉన్న నీటిని విడుదల చేసి ఉంటే ఇంత నష్టం వాటిల్లేది కాదని పలువురు విమర్శిస్తున్నారు. అనుకున్నట్టుగానే రెండో తుఫాన్ ప్రజల తలరాతలను మార్చేసింది. ఒక్కసారిగా వరద ప్రవాహం పెరగడంతో జలాశయాల గేట్లు ఎత్తేశారు. దీంతో పెన్నానది పోటెత్తింది. రాత్రికి రాత్రే పెన్నా పరీవాహక ప్రాంతాలు నీట మునిగాయి. తెల్లారే సరికి నిస్సహాయ స్థితిలో నీట మునిగిన ఇళ్లను ప్రజలు వదిలి పోవాల్సి వచ్చింది. రహదారులు తెగిపోయాయి. రైళ్ల రాక పోకలు ఆగిపోయాయి. లక్షలాది మంది వీధిన పడ్డారు. ఇదంతా ఎవరు చేసిన పాపం? సీమ వాసులకు ఇది శాపంగా మారింది. ఇలా ఉండగానే మరో గండం వచ్చింది.. మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి.. ఇంకా ఎంత కాలం ఈ దుర్భర పరిస్థితులను భరించాలో అని ప్రజలు దిక్కుతోచని స్థితిలో భయపడుతున్నారు.