ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్‌రావు విషయంలో సిట్ కీలక నిర్ణయం

 

ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు సహకరించకుండా సిట్ బృందాన్ని ముప్పతిప్పలు పెడుతున్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విషయంలో సిట్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు ఢిల్లీకి వెళ్లారు. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్, సిట్ అధికారి ఏసీపీ వెంకటగిరి ఢిల్లీకి చేరుకున్నారు. ఇప్పటివరకూ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును  సిట్ అధికారులు ఐదుసార్లు విచారించారు. ఐదు సార్లు సుమారు నలభై గంటలపాటు ప్రభాకర్‌రావును విచారించింది సిట్. అయితే విచారణలో సమాధానాలు చెప్పకుండా అధికారుల సహనాన్ని పరీక్షించారు ఎస్‌ఐబీ మాజీ చీఫ్. ఈ క్రమంలో ప్రభాకర్ రావు విచారణకు సహకరించకపోవడంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 

సుప్రీంకోర్టులో ప్రభాకర్ రావుకు ఉన్న రిలీఫ్ రద్దు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేయాలని సిట్ అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగానే డీసీపీ విజయ్ కుమార్, ఏసీపీ వెంకటగిరి ఢిల్లీకి వెళ్లారు. గురువారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు సిట్ అధికారులు. పిటిషన్‌లో ప్రభాకర్ రావు మినహాయింపులు రద్దు చేయాలని కోరనున్నారు. ప్రభాకర్ రావును కస్టోడియల్ విచారణ చేస్తే కీలకమైన విషయాలు వెలుగు చూస్తాయని సిట్ అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ప్రభాకర్ రావును ఆగస్టు ఐదు వరకు అరెస్టు చేయవద్దంటూ సుప్రీంకోర్టు ఇదివరకే ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు ఢిల్లీకి వెళ్లి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలని నిర్ణయించారు. ఇప్పటివరకూ సిట్ అధికారులను ప్రభాకర్ రావు తప్పుదోవ పట్టించే విధంగానే సమాధానాలు చెబుతూ వచ్చారు. 

తనకేమీ సంబంధం లేదని, తన పైస్థాయి అధికారులు ఇచ్చిన ఆదేశాలనే అమలు చేశానని, వ్యక్తిగతంగా ఫోన్ ట్యాపింగ్ చేయమంటూ ఎవరికీ ఉత్తర్వులు ఇవ్వలేదంటూ చెప్పుకొచ్చారు. కానీ ఈ కేసులో అరెస్ట్ అయిన ఐదుగురు నిందితులు ఇచ్చిన స్టేట్‌మెంట్ ప్రకారం.. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే తాము ఇదంతా చేశామని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఆగస్టు 5 వరకు ప్రభాకర్ రావును అరెస్ట్ చేయొద్దంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో.. సిట్ అధికారులకు ఆయన డిఫెన్సివ్ మోడ్‌లోనే సమాధానాలు చెబుతూ వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సుప్రీం ఇచ్చిన మినహాయింపులను రద్దు చేస్తే ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ను కస్టోడియల్ విచారణకు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ మేరకు ప్రభాకర్ రావుకు ఇచ్చిన మినహాయింపులు రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలని సిట్ అధికారులు నిర్ణయించారు.