బాహుబలి నిర్మాతల మాస్టర్ ప్లాన్.. ఈసారి ఎన్ని వందల కోట్లు..?
on Jul 10, 2025
తెలుగు సినిమాని ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన సినిమా అంటే బాహుబలి అని చెప్పవచ్చు. ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఆర్కా మీడియా నిర్మించిన ఈ చిత్రం.. భారతీయ సినిమాలో సరికొత్త చరిత్రను సృష్టించింది. బాహుబలి పార్ట్-1 2015 జూలై 10న విడుదలై వరల్డ్ వైడ్ గా రూ.600 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టగా.. పార్ట్-2 2017 ఏప్రిల్ 28న విడుదలై రూ.1800 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. బాహుబలి-1 విడుదలై నేటితో పదేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్మాతలు కీలక ప్రకటన చేశారు. రెండు భాగాలను కలిపి ఒకే సినిమాగా విడుదల చేయబోతున్నారు.
కొంతకాలంగా రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. పలు సినిమాలు మళ్ళీ థియేటర్లలో అడుగుపెట్టి మంచి వసూళ్లతో సత్తా చాటుతున్నాయి. ఇప్పుడు బాహుబలి వంతు వచ్చింది. రెండు భాగాలను కలిపి ఒకే సినిమాగా ఈ ఏడాది అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. అసలే బాహుబలి అనేది ఓ వండర్. అలాంటిది రెండు పార్ట్ లను కలిపి ఒకే మూవీగా రిలీజ్ చేస్తే.. ఆడియన్స్ ఈ సినిమాని మళ్ళీ థియేటర్లలో చూడటానికి ఆసక్తి చూపుతారు అనడంలో సందేహం లేదు. అదే జరిగితే బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురుస్తుంది. రీ రిలీజ్ ల పరంగా ఇప్పట్లో ఏ సినిమా బీట్ చేయలేని కలెక్షన్స్ బాహుబలి సాధించే అవకాశముంది. కొన్ని భారీ సినిమాలు ఫస్ట్ రిలీజ్ లో కలెక్ట్ చేసే వసూళ్లను.. బాహుబలి రీ రిలీజ్ లో కలెక్ట్ చేసినా ఆశ్చర్యంలేదు.
కాగా, బాహుబలి మూవీ తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఇలా పాన్ ఇండియా భాషల్లో రీ రిలీజ్ అవుతున్న మొదటి సినిమా బాహుబలినే కావడం విశేషం.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
