వైసీపీ పిలిచింది.. రానని చెప్పా! జగన్ కేసులపై జేడీ లక్ష్మినారాయణ సంచలనం.. 

సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా సంచనాలకు కేరాఫ్ గా నిలిచారు లక్ష్మీనారాయణ. ఆయన పర్యవేక్షణలో సాగిన జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ దేశ వ్యాప్తంగా సంచలనమైంది. ఆ తరువాత  రాజకీయాల్లోకి వచ్చారు లక్ష్మినారాయణ. పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరి విశాఖ ఎంపీగా పోటీ చేశారు. వైసీపీ హవాలో జేడీ లక్ష్మీనారాయణ ఓడిపోయారు. 2019 ఎన్నికల తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. జనసేన పార్టీ నుంచి బయటికి వచ్చారు లక్ష్మినారాయణ. ఆయన తిరిగి రాజకీయాల్లో వస్తున్నారనే ప్రచారం కొంత కాలంగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఓ మీడియా ఇంటర్వూలో తన రాజకీయ కార్యాచరణపై కీలక విషయాలు చెప్పారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ. 

తనకు జగన్ పార్టీ నుంచి ఆహ్వానం వచ్చిందని చెప్పారు లక్ష్మినారాయణ.  వైసీపీ ఎంపీతో పాటు మరికొందరు నాయకులు తనను కలిసి.. తమ పార్టీలోకి రావాలని కోరారని చెప్పారు. అయితే తాము వైసీపీలోకి రాలేనని చెప్పానని లక్ష్మినారాయణ వెల్లడించారు. తాను జగన్ కేసును అంత సీరియస్ గా తీసుకున్నా ప్రజలు మాత్రం బ్రహ్మరథం పట్టారని అలాంటప్పుడు ఆయన పార్టీలో చేరొచ్చుగా అన్న ప్రశ్నకు .. ‘ఒక వ్యక్తి మీద కేసులు వేరు.. ఆయన చెప్పిన విధానం వేరు. ఆయన చెప్పిన కొన్ని విధానాలతో ప్రజలు ఆదరించారు. దీంతో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు’ అని సీబీఐ మాజీ జేడీ సమాధానమిచ్చారు.

జనసేనలోకి మళ్లీ వెళతారా అన్న ప్రశ్నకు జేడీ లక్ష్మీనారాయణ ఆసక్తికర సమాధానం చెప్పారు. జనసేనతో మళ్లీ చర్చలు జరుపుతానని స్పష్టం చేశారు. మళ్లీ వారు పిలిస్తే వెళుతాను.. జనసేన పార్టీ విధానాలు నచ్చడం వల్లే అందులో చేరానని తెలిపారు. కొంతకాలం దూరంగా ఉన్నా మళ్లీ చేరే అవకాశం ఉంటుంది.. అయితే ఏ సమయం అనేది చెప్పలేను అని జనసేన రీ ఎంట్రీకి సంబంధించి జేడీ లక్ష్మీనారాయణ క్లారిటీ ఇచ్చారు.

తాను కొత్త పార్టీ పెడుతున్నట్లు గతంలో జరిగిన ప్రచారంపైనా స్పందించారు లక్ష్మినారాయణ.  తాను ‘జనధ్వని’ అనే పార్టీ కోసం రిజిస్టర్ చేసుకున్నానే ప్రచారం జరిగిందని.. కానీ అది వేరే వాళ్ల పార్టీ అని చెప్పారు. ఆ పార్టీని తనకిస్తానని ఆఫర్ వచ్చింది నిజమేనని అంగీకరించారు. కానీ సొంతంగా తాను పార్టీకి రిజిస్టర్ చేయలేదని చెప్పారు లక్ష్మినారాయణ. లోక్ సత్తా కన్వీనర్ జయప్రకాశ్ నారాయణ కూడా ఆయన పార్టీని నడిపించాల్సిందిగా తనను కోరారని సీబీఐ మాజీ జేడీ వెల్లడించారు.