గాంధేయ మార్గమే భవిష్యత్ సోపానం!!

మామ కాని మామ ఎవరు??

చందమామ!!

బావ కాని బావ ఎవరు??

కాకి బావ!!

కోడి కాని కోడి ఏది??

పకోడి 
చిన్నపిల్లలకు సరదాగా చెప్పే ఈ మాటల్లో మరొకటి చేర్చాలి. యావత్ భారతము ఒక్కే పలుకుగా పలికే మరొక మాటను కూడా చేర్చాలి. ప్రతి కుటుంబంలో పిల్లలు, పెద్దలు అందరూ తమ సొంతమన్నట్టు ఆప్యాయంగా పిలుచుకునే పలుకు చేర్చాలి. అదే…

తాత కాని తాత ఎవరు??

గాంధీ తాత!!

ప్రతి ఒక్కరూ ఏక కంఠంగా చెప్పే మాట ఇది.

భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన మహనీయుల జాబితాలో మొదటగా స్మరించుకునే పేరు మహాత్మా గాంధీ!! ఎందరో ఎన్నో పోరాటాలు చేసినా గాంధీని ఎక్కువగా చెప్పుకోవడానికి కారణం ఏమిటని చూస్తే కనిపించేదే అహింసా ఆయుధం!!

నిజమా చెప్పాలంటే ప్రతి మనిషిని తమ జీవితంలో దేన్నీ వదిలేస్తే హాయిగా సంతోషంగా ఉండగలడో దాన్నే వదిలి పోరాటం చేయమన్నాడు గాంధీ!! 

బాపూజీ అని కూడా పిలుచుకునే మన గాందీ జీవితం విశ్లేషణగా తెలుసుకుంటే ఎన్నో అర్థమవుతాయి. మానసికంగా, వ్యక్తిగతంగా కూడా ఎంతో మార్పు మనిషిలో చోటు చేసుకుంటుంది!! 

అహింసా ఆయుధం!!

చాలామంది గాంధీ అహింసను భోదించాడు దానివల్ల నష్టం ఎంతో జరిగిందని అనుకుంటారు కానీ ఆ అహింస అనే మార్గం అప్పటికప్పుడు పుట్టినది కాదు. ఆయన జీవన ప్రయాణంలో ఆయన ఎదుర్కొన్న ఎన్నో సందర్భాల ఫలితాల నుండి పుట్టినదే ఆ ఆలోచన. ఇది అర్థం చేసుకోలేని వారు నిజంగా ఆలోచనా శక్తి లేనివాళ్లే అనుకోవాలి.

ప్రతి మనిషి మరొక మనిషిని, లేదా జంతువును, లేదా పక్షులను ఇలా ఇతర జీవులను హింసించే స్వభావం అంతర్లీనంగా కలిగి ఉంటారు. వాటిని కొన్ని మార్గాల ద్వారా నిర్మూలించుకుని హింసకు దూరంగా ఉంటూ సకల జీవులను ప్రేమించే గుణాన్ని పెంపొందించుకోవచ్చు. అయితే ఆ హింసా ప్రవృత్తిని వదిలిపెట్టకపోతే మనిషిలో సాత్విక గుణం అనేది నశించిపోయి మృగానికి సమానమైన వ్యక్తిత్వానికి చేరుకుంటాడు. అందుకే అహింసా మార్గం ఎంతో గొప్పది.

చిన్న పిల్లలకు కూడా బాగా తెలిసిన కథ మూడు ప్రమాణాలు, వాటినే three promises  అనే పేరుతో కథలుగా చెబుతుంటారు కూడా. గాంధీ దక్షిణాఫ్రికా ప్రయాణంలో తల్లికి చేసిన ప్రమాణాలు లేదా మాటలే ఎంతోమందికి మార్గదర్శకాల వంటివి.

మద్యానికి దూరంగా ఉండటం

మాంసాన్ని దూరంగా ఉండటం

స్త్రీల మీద వ్యామోహం లేకుండా ఉండటం.

ప్రస్తుత సమాజంలో ఈ మూడింటి వల్ల నష్టపోయేవాళ్ళు కోకొల్లలు ఉన్నారు. ముఖ్యంగా, మద్యం,  స్త్రీల మీద వ్యామోహం ఉన్న మగవాడు బాగుపడుతున్న ఛాయలు ఎక్కడా లేవనేది నిజం.

సత్యాగ్రహ సాధనం

ఆయుధాలు చేతబట్టి యుద్ధంతో చేయలేని పనిని మౌనాన్ని ఆయుధంగా చేసుకుని సాదించడ్సమ్ ఎలాగో నేర్పినవాడు మహాత్ముడు. చంపారన్ సత్యాగ్రహం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం ఇలా ఎన్నో గాంధీ ఆధ్వర్యంలో జరిగాయి. వీటిలో క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో గాంధీ "do or die" అని దేశ ప్రజలకు ఇచ్చిన పిలుపు ఎంతో శక్తిమంతంగా పనిచేసింది.

ఇంకా తన నూలు తానే వడకటం, తన బట్టలు తానే ఉతుక్కోవడం,  గాంధీ తన ఆశ్రమంలో క్రమశిక్షణగా ఉంటూ అందరికి ఆదర్శవంతంగా ఉండటం చూస్తే!!  మనిషి మరొకరికి ఏదైనా చెప్పే ముందు తాను సక్రమంగా ఉండాలి అని విషయం గుర్తొస్తుంది.

దేశానికి, ప్రపంచానికి అహింసాను భోదించింది, సత్యమేవ జయతే అనే మాటను విశ్వసించి, దాన్ని అక్షరాలా తన జీవితంలో ఆచరణలో పెట్టిన మహాత్ముడి గురించి ఇలా నాలుగు మాటలు చెప్పుకుని నిశ్శబ్దం అవ్వకూడదు. నేటి బాలలకు గాంధీ జీవితాన్ని పరిచయం చేసి విలువల కోటలను నిర్మించాలి.

◆ వెంకటేష్ పువ్వాడ