జై జవాన్ జై కిసాన్ జయహో శాస్త్రీజీ!!

అక్టోబర్ 2 ప్రత్యేకత ఏమిటని అడిగితే భారతమంతా గాంధీ పేరు చెబుతుంది. కానీ దేశం కోసం పాటు పడిన శాస్త్రీ గురించి తెలిసిన వాళ్ళు చాలా తక్కువ. భారత చరిత్రలో గర్వంగా చెప్పుకోదగ్గ పేరు లాల్
బహదూర్ శాస్త్రీ. విలువల జీవితాలు ఎప్పుడైనా చదవాలని అనిపిస్తే అందులో మొదటి వరుసలో లాల్ బహదూర్ శాస్త్రి గారి జీవితాన్ని చేర్చవచ్చు.

స్వాతంత్రోద్యమంలో ప్రముఖ పాత్ర పోషించి, గాంధీకి నెహ్రు కు ఎంతో ప్రియమైన వ్యక్తిగా మెలిగిన శాస్త్రి గారి గురించి భారత ప్రజలకు సరిగా తెలియని ఎన్నో ఆసక్తికర  విషయాలు ఉన్నాయి.

భారతదేశానికి మొట్టమొదటి రైల్వే మంత్రిగా పనిచేసిన శాస్త్రి గారు, తరువాత హోం మినిష్టర్ గా,  తరువాత ప్రధానమంత్రిగా కూడా చేసినా మరణించే వరకు తనకంటూ సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోలేదు అంటే
ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో అర్థమవుతుంది. అణువంత స్థానం దొరకగానే దొరికిన వరకు దోచుకోవాలని అనుకునే రాజకీయాల్లో ఎంతో నిజాయితీ కలిగిన శాస్త్రి గారిలాంటి వాళ్ళు ఉండటం చాలా అరుదు. 

శాస్త్రి గారి వ్యక్తిత్వమెలాంటిదో ఒక చిన్న ఉదాహరణ!!

లాల్‌బహదూర్‌శాస్త్రి ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన పెద్దకొడుకు హరికృష్ణ శాస్త్రి అశోక్ లేలాండ్ సంస్థలో ఉద్యోగం చేస్తుండేవాడు. ఆ సంస్థవారు హరికృష్ణశాస్త్రికి సీనియర్ జనరల్ మేనేజర్‌గా ప్రమోషన్
ఇచ్చారు. ప్రమోషన్ రాగానే ఎంతో సంతోషించిన హరికృష్ణశాస్త్రి మరుసటిరోజు లాల్‌ బహదూర్‌ శాస్త్రి గారి దగ్గరకు వెళ్లి, తనకు ప్రమోషన్ వచ్చిన విషయం  తెలిపాడు. అప్పుడు శాస్త్రి గారు ఒక నిమిషం ఆలోచించి,
‘‘హరీ, ఆ సంస్థ, ఆకస్మాత్తుగా నీకెందుకు ప్రమోషన్ ఇచ్చిందో నేను ఊహించగలను. ఇప్పుడు ప్రమోషన్ ఇస్తారు మళ్లీ కొన్నిరోజుల తరువాత, ఆ కంపెనీవాళ్ళు ఏదో ఒక సహాయం చేయమని నీ ద్వారా
నాదగ్గరకు వస్తారు. నేను వాళ్లకు సహాయం చేశాను అనుకో  దేశ ప్రజలు ఏమనుకుంటారో తెలుసా!! శాస్త్రి గారి అబ్బాయి పనిచేసే కంపెనీ కాబట్టే శాస్త్రి గారు సహాయం చేసారు అని అనుకుంటారు. నీటి
నిజాయితీల ఆధారంగా, ధర్మ బద్దంగా ఉండాల్సిన ప్రధానమంత్రి కొడుకు కోసం ఆ సంస్థకు సహాయం చేసారు అని చెప్పుకుంటారు. 

నేనే అలా.చేస్తే సామాన్య ప్రజలు ఇలా విలువల గురించి ఆలోచిస్తారా??  నీకూ తెలుసు. పాలకుల నిజాయితీని ప్రజలు శంకించేలాగా జీవించడానికి నేను వ్యతిరేకం. కాబట్టి నీవు వెంటనే ఆ సంస్థలో నీ
ఉద్యోగానికి రాజీనామా చేయి. నేను ప్రధానిగా వున్నంతకాలమూ నీవు ఆ సంస్థలో ఉద్యోగం చేయడానికి లేదు’’ అన్నారట.

లంచాల కోసము, కొడుకుల భవిష్యత్తు కోసం ఎన్నెన్నో స్కామ్ లలో దిగుతున్న నేటి రాజకీయ నాయకులు అలవాటు చేసుకోవలసిన వ్యక్తిత్వం శాస్త్రి గారిది.

భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధ సమయంలో సైనికుల కోసం, దేశంలో ఆహారం ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోకుండా, సొంతంగా మన దేశమే అధిక దిగుబడులు సాదించాలంటే రైతులకు
ప్రోత్సాహం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో  "జై జవాన్ జై కిసాన్" నినాదాన్ని భారతానికి అందించిన శాస్త్రి గారు, ఆయన జీవితం, ఆయన నమ్మిన విలువలు, ఆచరించిన విధానం అన్ని కూడా ప్రతి ఒక్కరికి గొప్ప
పాఠాల్లాంటివి!! కాదంటారా??

◆ వెంకటేష్ పువ్వాడ