ఆనందమే అందం

హాస్యం-అపహాస్యం!!
నవ్వడం ఒక భోగం!!
నవ్వించడం ఒక యోగం!!
నవ్వలేకపోవడం ఒక రోగం!!

అబ్బబ్బా ఏమైనా చెప్పారా జంధ్యాల. కేవలం చెప్పడంతో ఆగిపోలేదే, హాస్యాన్ని జోడించి, ఆ హాస్యంలో కూడా సమాజానికి కాస్తో, కూస్తో సందేశాలు ఇస్తూ సినిమాలు తీసి, నవ్వుల జల్లు కురిపించిన ఘనుడు ఆయన. ఎక్కడా అసభ్య పదజాలం వాడకుండా, ఎంతో ఆరోగ్యవంతమైన హాస్యాన్ని ప్రజలకు సినిమాల ద్వారా అందించినవారు జంధ్యాల. ఇదేమి జంధ్యాల గారి గురించి ఊదరగొట్టడానికి రాస్తున్నది కాదు కానీ ఉత్తమ హాస్యానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచినవారు కాబట్టి చెప్పుకోవలసిందే. 

అంతకు ముందు….

పాత సినిమాలు చూస్తే అందులో రేలంగి, రాజబాబు, పేకెటి రంగా, గిరిజ, రమాప్రభ వీళ్ళ నుండి హాస్యాన్ని దోసిళ్ళతో పట్టుకున్న రాజేంద్రప్రసాద్, ఆలీ, చంద్రమోహన్, శ్రీలక్ష్మి వీళ్ళందరూ ఉన్న సినిమాలలో ఎలాంటి భయం లేకుండా హాయిగా నవ్వుకుంటూ సినిమాలు చూసే వెసులుబాటు ఉండేది.

ఆ తరువాత

తరువాత తరువాత కాలం మారేకొద్ది కొత్తదనం పేరులో హాస్యాన్ని అపహాస్యం చేయడం  మొదలుపెట్టారు. ఎక్కడ చూసినా హాస్యం పేరుతో అసభ్య పదజాలన్ని వాడుతున్నారు. వాటిని పిల్లల కోసం ప్రత్యేకం అన్నట్టు కవరింగ్ ఇచ్చి నిజంగా పిల్లల్ని కూడా అసభ్య పదజాలానికి అలవాటు చేస్తున్నారు.

షోస్ లో ఏముంది??

టీవీ లో ప్రసారం అయ్యే ప్రతి చానల్ లో ఒక కామెడీ షో తప్పక ఉంటోంది. ఆ షో లలో పిల్లల్ని కూడా భాగస్వాములను చేసి వాళ్ళతో పెద్ద పెద్ద డైలాగులు, డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడిస్తూ ఉంటారు. అవన్నీ చూసే ఇంట్లో పిల్లలు కూడా వాటిని అలవాటు చేసేసుకుంటారు. చిన్నా పెద్దా లేకుండా పంచు డైలాగులు వేయడం అన్ని చోట్లా కామన్ అయిపోతోంది.

అసలింతకూ అసలైన హాస్యం అంటే ఏమిటి??

అసభ్యత లేకుండా, ఒకరిని నొచ్చుకునేలా చేయకుండా, సరదాగా నవ్వించేది హాస్యం. అలా నవ్వించే వారు నిజంగా నవ్వుల రాజులు, కిలకిల రాణులు అనుకోవచ్చు. కానీ ఇప్పుడెక్కడుంది అలాంటి హాస్యం.

సాడిజంలో హాస్యం

ప్రస్తుత టీవీ షోల పుణ్యమా అని ఒకరిని కొట్టడంలో, ఒకరిని తిట్టడంలో, ఒకరి ఇబ్బందిని ఎగతాళి చేయడంలో హాస్యం పాళ్లు పుష్కలంగా నింపేస్తున్నారు. ఫలితంగా ఇళ్లలో పిల్లలు కూడా వాటిలోని హాస్యాన్ని చూస్తూ వాటి ద్వారానే హాస్యాన్ని సృష్టిస్తున్నారు.

ఒక అరభై సంవత్సరాల తాతయ్య తన పదేళ్ల మనవడితో ఒరేయ్ నువ్వు ఉద్యోగం చేసి,డబ్బు సంపాదించి నాకు మంచి బట్టలు కొనివ్వాలిరా అని అడిగితే, ఆ పదేళ్ల బుడ్డోడు తన తాతతో  నేను చదువు పూర్తి చేసి, ఉద్యోగం తెచ్చుకుని సంపాదించే వరకు నువ్వు బతికే ఉంటావా?? అప్పుడు నేను బట్టలు కొని నీ సమాధి మీద కప్పుతాలే అంటాడు. ఇలాంటివి ఈ కాలంలో ఎన్నో వింటున్నారు, చూస్తున్నారు. 

పిలల్లో విలువల స్థాయి అంతకంతకూ తగ్గిపోతోంది, వాళ్ళు వయసును మించి మాట్లాడే ప్రతి మాటా బాల్యానికి ఉన్న అర్థాన్ని మార్చేస్తున్నాయి.

ఏమి చేయాలిప్పుడు??

హాస్యం అంటే మనసారా నవ్వుకుంటూ పిల్లల్లో ఆలోచనా శక్తిని పెంపొందించేలా ఉండాలి. ఆ కోవలోకి చెందినవే అక్బర్-బీర్బల్ కథలు, తెనాలి రామకృష్ణ కథలు, పరమానందయ్య శిష్యుల కథలు, పంచతంత్ర కథలు మొదలైనవి. ఇవన్నీ పిల్లలకు నవ్వు తెప్పిస్తూనే అందులో నీతిని, విలువలను మెల్లగా మెదడులలోకి జోప్పిస్తాయి. అవన్నీ కూడా పుస్తకాల ద్వారా కాకపోయినా ఆడియో, వీడియో లు అందుబాటులో ఉంటాయి కాబట్టి తల్లిదండ్రులు కాస్త శ్రద్ధ పెట్టి, పిల్లలకు అసభ్య హాస్యాన్ని దూరంగా ఉంచుతూ ఆరోగ్యకరమైన హాస్యాన్ని అందించాలి.

పార్కులలో కూర్చుని ఊరికే గట్టిగా నవ్వుతూ నవ్వుతో ఆరోగ్యం అని చెప్పుకునే బదులు, కాసేపు చిన్నపిల్లల్లా మారిపోయి చిన్ననాటి కథల పుస్తకాల్లో పేజీలను తిరిగేస్తూ, వాటిలో నుండి మిమ్మల్ని మీరు వెతుక్కుంటే హాస్యం అపహాస్యం కాకుండా ఆరోగ్యమస్తు అని దీవించడం ఖాయం.
కాదంటారా??

◆ వెంకటేష్ పువ్వాడ