సింహం ముందు మతాధికారి మహిమ... పనిచేయలేదు!

‘ఫ్లూటు జింక ముందు ఊదు.... సింహం ముందర కాదు’ అని మన బాలయ్యబాబు చెప్పిన డైలాగుని సదరు మతాధికారి విన్నాడో లేదో కానీ, సింహాల ముందు తన మహిమను చూపించబోయాడు. ఎలెక్‌ డివానే అనే ఆయన దక్షిణాఫ్రికాలోని ఓ క్రైస్తవ మతాధికారి. గత వారం ఎలెక్‌, చర్చిలోని తన సహచరులతో కలిసి, క్రూగెర్‌ అనే నేషనల్‌ పార్కుకి చేరకున్నాడు. అక్కడ తిరుగుతున్న సింహాలను చూడగానే ఎలెక్‌కు ఎక్కడలేని ఉత్సాహం వచ్చేసింది. ఒక్కసారిగా పూనకం పూనినవాడిలా వాహనం తలుపు తీసుకుని సింహాల దగ్గరకి పరిగెత్తాడు. మొదట్లో ఏదో ఆహారాన్ని తింటున్న సింహాలు అతడిని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఎలెక్‌ అరుపులు విన్న సింహాలు అతడి మీదకి వెళ్లడం మొదలుపెట్టాయి.

తన మహిమ పనిచేయడం లేదని అనుమానం రావడంతో ఎలెక్‌ వెనక్కి తిరిగి పరుగు లంకించుకున్నాడు. కానీ సింహాలు వదుల్తాయా! ఒక సింహం అతని వెంటపడి ఎలెక్‌ పిరుదులను కొరికి పారేసింది. ఇంతలో అటవీశాఖ అధికారులు గాల్లోకి తుపాకులను పేల్చడంతో, సింహాలు పారిపోయాయి. ఎలెక్‌ ఊపిరి దక్కించుకున్నాడు. ఆసుపత్రిలో కోలుకుంటున్న ఎలెక్‌ను ‘మీరెందుకలా చేశారని’ అడిగితే.... ‘భగవంతుడు నా ద్వారా తన మహిమను చూపిస్తాడనుకున్నాడు. ఈ భూలోకంలోని జీవులందరి మీదా మనిషికే కదా అధికారం ఉంది’ అని వాపోయాడట ఎలెక్‌! పాపం ఎలెక్ నమ్మకం గురించి సింహాలకు తెలియదేమో! లేకపోతే సదరు మతాధికారికి కాస్త దూరంగా ఉండేవి కదా!

Online Jyotish
Tone Academy
KidsOne Telugu