పెట్రోల్‌ డబ్బాతోనే తేల్చుకుందాం.. కొడాలి నానికి రిటర్న్ ఛాలెంజ్..

అంత క్లియర్‌గా వీడియోలు క‌నిపిస్తున్నాయి. అంత క్లియ‌ర్‌గా తానాతందాన న‌డిచింది. అంత క్లియ‌ర్‌గా కేసినో విజువ‌ల్స్ బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అంత క్లియ‌ర్‌గా పేకాట‌, మందు, చిందు దృశ్యాలు వైర‌ల్ అయ్యాయి. ఇంకా చెప్పాలంటే.. సీలింగ్‌కు వైసీపీ క‌ల‌ర్ క్లాత్‌ డెక‌రేష‌న్‌.. కొడాలి నాని పేరుతో డీజే సాంగ్‌.. ఇంత‌కంటే ఇంకేం సాక్షం కావాలి గుడివాడ‌లో గోవా క‌ల్చ‌ర్ గురించి చెప్పాలంటే. అయినా, అదంతా లేదంటున్నారు కొడాలి నాని. త‌న క‌న్వెన్ష‌న్‌లో ఎలాంటి కేసినో న‌డ‌ప‌లేదని బుకాయిస్తున్నారు. నిరూపిస్తే.. పెట్రోల్ పోసుకొని సూసైడ్ చేసుకుంటానంటూ స్టేట్‌మెంట్లు కూడా ఇచ్చారు. న‌వ్విపోదురుగాక నాకేంటి అన్న‌ట్టు ఉంది నాని తీరు అంటున్నారు. 

అయితే, ఓకే. కొడాలి స‌వాల్‌కు తాము కూడా సై అంటున్నామని ప్ర‌తిస‌వాల్ చేశారు. "మంత్రి సవాల్‌ను స్వీకరిస్తున్నాం. క్యాసినో జరిగిందని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడు రావాలో చెప్పండి. చెరో పెట్రోల్‌ డబ్బా తెచ్చుకుందాం.. తేల్చుకుందాం. క్యాసినోలో డ్యాన్స్‌లు వేసిన వారి పేర్లూ మా ద‌గ్గ‌ర‌ ఉన్నాయి. విక్టర్‌, శశిభూషణ్‌ వంటి వాళ్లు డ్యాన్స్‌లు వేశారు. కరోనా వచ్చిందని హైదరాబాద్‌లో ఉంటే చేసిన తప్పులు పోతాయా?"  

"క్యాసినో జరగలేదంటే పెట్రోల్‌ పోసుకునేందుకు నేను సిద్ధం. రుజువైతే మంత్రి పదవికి రాజీనామా చేయి చాలు. క్యాసినో జరిగిందని మీడియా సమక్షంలో నిరూపణకు సిద్ధం. అర్ధనగ్న నృత్యాలు జరిగితే తానే ఆపించానని నాని ఒప్పుకొన్నారు" అని బొండా ఉమా అన్నారు. 

ఏ తప్పూ చేయకుంటే నిజనిర్ధరణ కమిటీని ఎందుకు అడ్డుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు. కె కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన క్యాసినో వీడియోలను మ‌రోసారి మీడియాకు విడుదల చేశారు. మ‌రి, టీడీపీ నేత బోండా ఉమా ప్ర‌తిస‌వాల్‌కు కొడాలి నాని సిద్ధ‌మా? స్పాట్ మీరు పెడ‌తారా.. మేమే పెట్టాలా?  పెట్రోల్ డ‌బ్బా మీరు తీసుకొస్తారా.. మేమే తీసుకురావాలా? అంటూ సోష‌ల్ మీడియాలో చెల‌రేగిపోతున్నారు తెలుగు త‌మ్ముళ్లు.