తూచ్.. నేను సీఎం కేండిడేట్ కాదు.. ప్రియాంక ఔట్‌..

ఉత్తర ప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది మాత్రం ఆ ఒక్క రాష్ట్రమే. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి, అనే విషయంలో ఒక్క యూపీలోనే కాదు దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్నే కాకుండా  దేశ రాజకీయ భవిష్యత్’ ను నిర్ణయిస్తుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.అలాగే, 2024 లోక్ సభ ఎన్నికలకు సెమి ఫైనల్ అనే అభిప్రాయం కూడా అందరిలో వుంది. 

అదలా ఉంటే మరో యూపీ అసెంబ్లీ ఎన్నికల వేదిక చిత్ర విచిత్ర రాజకీయ విన్యాసాలకు వేదిక అవుతోంది. ఇటు నుంచి అటు అటు నుంచి ఇటూ ఫిరాయింపులు జోరుగా సాగుతున్నాయి. మరో వంక ముఖ్యమంత్రుల రేసులో నిలిచిన ప్రస్తుత ముఖ్యమంత్రి యోగీ ఆదిత్య నాథ్, మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ మొదటి సారిగా అసెంబ్లీ బరిలో దిగుతున్నారు. ఇంతరకు పెద్దల సభ సభ్యులుగానే ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వహించిన ఆ ఇద్దరూ .. ఈసారి ఎన్నికల బరిలో దిగుతున్నారు. ప్రత్యక్షంగా ప్రజల తీర్పు కోరుతున్నారు. 

అయితే, అదలా ఉంటే నేను కూడా సీఎం రేసులో ఉన్నానని, కేవలం రెండు రోజుల క్రితం ప్రకటించిన కాంగ్రెస్ అగ్రనేత ప్రియంకా వాద్రా, అంతలోనే డ్రాపై పోయారు. ముఖ్యమంత్రి రేసులో తాను లేనని ప్రకటించారు. అదేమంటే, ఒకరికి ఇద్దరు అదే ప్రశ్న అడగడంతో ‘చిర్రెత్తి’ అలా సమాధానం ఇచ్చానే గానీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా తన బాధ్యతలు తనకున్నాయని, ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరో పార్టీ నిర్ణయిస్తుందని అన్నారు.

 అంతే కాదు, ఇంతవరకు సింహం సింగిల్ గానే వస్తుంది , కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని ప్రకటించిన ప్రియంకా వాద్రా, ఇప్పుడు ఒక్క బీజేపీ మినహా ఎవరితో అయినా పొత్తుకు సిద్దమని ప్రకటించారు. ఓ వంక మూడొంతుల స్థానాలకు  అభ్యర్ధులను, మ్యానిఫెస్టోను ప్రకటించిన హస్తం పార్టీ ఇప్పుడు  ఇలా ఒక్కసారిగా పోత్తులకు సిద్దమని ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంసమైంది. అయితే, ఈ అన్నిటికీ మూలం ప్రియాంక తనను తాను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించుకోవడం, అది కూడా రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె ఆ ప్రకటన చేయడంతో, రాహుల్ నోచ్చుకున్నారని,అందుకే, ఆమె సీఎం రేసు నుంచి తప్పుకున్నారని అంటున్నారు.