బండి దెబ్బకు ద‌డ‌ద‌డ‌.. సీఎస్‌, డీజీపీల‌కు లోక్‌సభ క‌మిటీ నోటీసులు..

బండి సంజ‌యే క‌దాని పోలీసులు ఓవ‌రాక్ష‌న్ చేశారు. దీక్ష‌కు దిగిన సంజ‌య్‌ను బ‌ల‌వంతంగా అరెస్ట్ చేశారు. బీజేపీ అధ్య‌క్షుడిని అలా లోప‌లేస్తే.. పెద్దాయ‌న ఫుల్ ఖుషీ అవుతార‌ని అనుకున్నారు. అలానే జ‌రిగింద‌నుకోండి. పైవాళ్లంతా సంబ‌ర‌ప‌డ్డారు. కానీ, వాళ్ల‌ పైవాళ్లు కూడా ఉంటార‌ని అక్క‌డి నుంచి యాక్ష‌న్ మొద‌ల‌వుతుంద‌ని అస్స‌లు ఊహించ‌లేక‌పోయారు. బండి సంజ‌య్ పార్ల‌మెంట్ స‌భ్యుడు అనే విష‌యం మ‌రిచి.. మొండిగా వ్య‌వ‌హ‌రించ‌డంతో.. ఇప్పుడాయ‌న జ‌గ‌మొండిగా త‌యారై.. తెలంగాణ ప్ర‌భుత్వ పెద్ద‌ల‌ను ఢిల్లీకి ఈడుస్తున్నారు. 

తాజాగా, బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ ఫిర్యాదుపై తెలంగాణ సీఎస్‌, డీజీపీల‌కి లోక్‌సభ ప్రివిలేజ్‌ కమిటీ నోటీసులు పంపింది. ఫిబ్రవరి 3న తమ ముందు హాజరుకావాలని నోటీసుల్లో ఆదేశించింది. కరీంనగర్‌ సీపీ, ఏసీపీ, జగిత్యాల డీఎస్పీ, కరీంనగర్‌ ఇన్‌స్పెక్టర్‌లకు కూడా ప్రివిలేజ్‌ కమిటీ నోటీసులు జారీ చేసింది.

బండి సంజయ్‌పై కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ అకారణంగా దాడి చేశారన్న ఫిర్యాదుపై పార్లమెంటరీ ప్రివిలేజ్‌ కమిటీ ఇప్పటికే విచారణ చేపట్టింది. తాజాగా, లోక్‌సభ ప్రివిలేజ్‌ కమిటీ ముందు బండి సంజయ్‌ వాంగ్మూలం ఇచ్చారు. కరీంనగర్‌లో జరిగిన ఘటన వివరాలను క‌మిటీకి తెలిపారు. తన పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును వివరించారు. 

కరీంనగర్‌లోని తన క్యాంపు కార్యాలయంలో జాగరణ దీక్షకు దిగగా పోలీసులు తలుపులు పగులగొట్టి అరెస్టు చేశారని.. పార్లమెంట్‌ సభ్యుడిగా తన హక్కులకు భంగం కలిగించారని కమిటీకి తెలిపారు. గ్యాస్‌ కట్టర్లు ఉపయోగించి తలుపులు బద్దలు కొట్టారని చెప్పారు. బండి సంజ‌య్ స్టేట్‌మెంట్‌తో.. లోక్‌స‌భ‌ ప్రివిలేజ్‌ కమిటీ తెలంగాణ‌ అధికారులకు నోటీసులు పంపించ‌డం రాజ‌కీయంగా ఆస‌క్తి రేపుతోంది.