రాజంపేట ఆర్టీసీ పెట్రోల్ బంక్‌లో రూ.65 లక్షలు స్వాహా
posted on Sep 21, 2025 12:58PM
అన్నమయ్య జిల్లాలో ఆర్టీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెట్రోల్ బంకులో భారీ స్థాయిలో అక్రమాలు చోటు చేసుకున్నాయి. రాజంపేటలోని ఆర్టీసీ పెట్రోల్ బంకులో చోటు చేసుకున్న అక్రమాలపై విచారణ పూర్తి కావడంతో పలువురి సిబ్బందిపై వేటు పడింది. సుమారు రూ. 62 లక్షలు మేర రాజంపేటలో ఆర్టీసీ పెట్రోల్ బంకులో అక్రమంగా నిధులు గోల్ మాల్ జరిగినట్టు అధికారులు ప్రాథమికంగా నిర్దారించారు. రాజంపేట డిపో మేనేజర్ తో సహా మరో ఆరుగురు సిబ్బందిని సస్పెండ్ చేశారు. గతంలో బంక్ నిర్వహణ లో పని చేస్తున్న 29 మందిపై కేసు నమోదు చేశారు.
గత ఏడాది డిసెంబర్ 7న రాజంపేటలో పెట్రోల్ బంక్ ప్రారంభించారు. పెట్రోల్ బంక్ నిర్వహణకు వచ్చిన వాహనాలకు పెట్రోల్ నింపేందుకు నంద్యాలకు చెందిన చంద్రమోహన్ అనే వ్యక్తికి కాంట్రాక్ట్ ఇచ్చారు. అతను ఆర్టీసీ అధికారులతో పాటు మరికొంత మంది ప్రైవేట్ వ్యక్తులను సిబ్బందిగా నియమించుకుని పెట్రోల్ బంకు నిర్వహణ చేపట్టారు.
ఈ నిర్వహణలో కాంట్రాక్టర్ భారీ అవినీతికి పాల్పడి కంప్యూటర్ పరిజ్ఞానంతో పెట్రోల్ బంక్ లో నిర్వహిస్తున్న స్కానర్లను మార్చడంతో పాటు ఫోన్ పే, గూగుల్ పే, డిజిటల్ పేమెంట్ లను పకడ్బందీగా రిజిస్టర్లో నమోదు చేసి లెక్కలు సరిపోయే విధంగా చూపించి అవినీతికి పాల్పడ్డారు. ప్రతి నెల నష్టాలు రావడంతో ఆర్టీసీ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.. అందులో భారీ ఎత్తున నిధులు గోల్మాల్ అయ్యాయని నిర్ధారించి అన్నమయ్య జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాలతో రాజంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రెండు రోజుల క్రితం కడప ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చంద్ర శేఖర్ బాధ్యులైన ఆర్టీసీ డియం రమణయ్యతో పాటు 5 మందిని సస్పెండ్ చేశారు.