మంగళగిరిలో నారా బ్రహ్మణి పర్యటన.. రెస్పాన్స్ మామూలుగా లేదుగా?
posted on Aug 14, 2025 12:54PM

మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో ఆయన సతీమణి, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కుమార్తె నారా బ్రాహ్మణి బుధవారం (ఆగస్టు 13) పర్యటించారు. ఆ సందర్భంగా ఆమె నియోజకవర్గంలోని పలు ప్రాంతాలను సందర్శించారు. తన భర్త ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంపై మమకారంతో ఆమె ఇప్పటికే అక్కడ తన స్వంత ఖర్చుతో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. వాటిలో ముఖ్యంగా మహిళల కోసం స్త్రీ శక్తి కుట్టు శిక్షణా కేంద్రం ఏర్పాటు చేశారు. అలాగే, స్థానిక పార్కులో పిల్లలకు ఆటసామగ్రిని తన స్వంత ఖర్చుతో ఏర్పాటు చేశారు. వీటన్నిటినీ ఆమె ఈ పర్యటనలో సందర్శించారు. అలాగే చేనేత కార్మికులు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించారు. నూతనంగా తీసుకువచ్చిన డిజైన్లను పరిశీలించారు. ‘స్త్రీ శక్తి’ కుట్టు శిక్షణా కేంద్రాలను పరిశీలించి, శిక్షణ సాగుతున్న తీరును ఆరా తీశారు. ఇప్పటి వరకు మూడు బ్యాచ్‌లుగా శిక్షణ పొందిన వారు సొంతగానే కుట్టు కేంద్రాలు ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా స్థిరత్వం పొందుతున్న తీరు పట్ల సంతోషం వ్యక్తం చేశారు. పార్కులో స్వయంగా తాను సొంత ఖర్చుతో ఏర్పాటు చేయించిన పిల్లలు ఆడుకునే పరికరాలు.. వస్తువులను నారా బ్రాహ్మణి పరిశీలించారు.
అలాగే మంగళగిరిలోని ప్రసిద్ధ పానకాలస్వామి ఆలయాన్ని నారా బ్రాహ్మణి సందర్శించారు. నారా లోకేష్ సొంత ఖర్చుతో కొనుగోలు చేసి ఇచ్చిన ఉచిత బస్సులో కొద్ది సేపు ప్రయాణించి, తోటి ప్రయాణీకులతో సంభాషించారు. నారా బ్రహ్మణి పర్యటనకు జనం నుంచి అద్భుత స్పందన వచ్చింది. కాగా నారా బ్రహ్మణి మంగళగిరిలో పర్యటించడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా అమె పలుమార్లు నియోజకవర్గంలో పర్యటించిన సంగతి తెలిసిందే.