పెన్షన్ రాలేదు.. టెన్షన్‌తో గుండెపోటు వచ్చింది...
posted on Dec 11, 2014 9:28AM

తెలంగాణ రాష్ట్రంలో ఒక పక్క రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. మరోవైపు పెన్షన్ రాలేదన్న దిగులుతో కొంతమంది వృద్ధులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మరికొందరు వృద్ధులు దిగులుతో కన్నుమూస్తున్నారు. ఈ పరిస్థితిని నివారించి బంగారు తెలంగాణను సాధించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తున్నప్పటికీ సాధ్యం కావడం లేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు ఇద్దరు లేదా ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇదిలా వుంటే, పెన్షన్ రాలేదని మనస్తాపానికి గురైన ఒక దళిత వృద్ధుడు గుండెపోటుతో మరణించాడు. ఖమ్మం జిల్లా మాణిక్యారం గ్రామానికి చెందిన భూక్యా బాలు అనే వృద్ధుడు పెన్షన్ కోసం తీవ్రంగా ప్రయత్నించాడు. అయితే ఆయనకు పెన్షన్ మంజూరు కాలేదు. దాంతో ఆయన మనస్తాపానికి గురయ్యాడు. గుండెపోటుతో గురువారం ఉదయం మరణించాడు.