నైటీతో బయటికొస్తే జరిమానా
posted on Dec 11, 2014 9:36AM

ఇవాళా రేపు లేడీస్ నైటీ వేసుకోవడం మామూలు విషయం అయిపోయింది. నైటీ వేసుకుని రోడ్ల మీద తిరిగే మహిళలను కూడా చూస్తూ వుంటాం. అయితే ఇలా మహిళలు నైటీలు వేసుకుని రోడ్ల మీదకు వస్తూ వుండటం వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయని భావించిన ఒక మహిళా మండలి ఈ ధోరణిని నివారించాలని అనుకుంది. నైటీ వేసుకుని రోడ్డు మీదకి వస్తే సదరు మహిళకు ఐదు వందల రూపాయల జరిమానా విధించాలని డిసైడ్ అయింది. నవీ ముంబైలోని గోఠివలి గ్రామంలోని ‘ఇంద్రాయణి’ మహిళా మండలి ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఇకనుంచి ఆ గ్రామంలోని మహిళలు నైటీలు వేసుకుని వుంటే ఇంటికే పరిమితం కావాలి. బయటకి వచ్చారో.... జరిమానా పడిందన్నమాటే. ఈ మేరకు గ్రామంలో పెద్దపెద్ద అక్షరాలతో నోటీసు బోర్డులను కూడా పెట్టారు. ఈ నిబంధన పెట్టింది ఏ మగానుభావుడో అయితే పెద్ద గొడవ జరిగి వుండేదే... మహిళలే ఈ నిబంధన పెట్టారు కాబట్టి ఆ ఊళ్ళో మహిళలు ఈ నిబంధనను పాటించక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నిబంధన పట్ల కొంతమంది మహిళలు రుసరుసలాడుతున్నప్పటికీ, పాటించక తప్పని పరిస్థితి ఆ గ్రామంలో ఏర్పడింది. ఈ నిబంధనను దేశమంతటా పెడితే బాగుంటుంది కదూ!