మంత్రులకు మునుగోడులో నో ఎంట్రీ బోర్డు!
posted on Jul 12, 2025 4:08PM
.webp)
అధికార కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి నల్గొండ జిల్లా కంచుకోట. అటువంటి ఆ జిల్లాలోని మునుగోడు నియోజక వర్గంలో మాత్రం జిల్లా మంత్రులకు ఎంట్రీ లేదంట. తన ఇలాకాలో జిల్లా మంత్రులకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ ఎంట్రీ పాస్ ఇవ్వడం లేదంట. ఒక విధంగా చెప్పాలంటే నో ఎంట్రీ బోర్డు పెట్టేశారంట. ఆ నియోజకవర్గంలో పర్యటనకు జిల్లా మంత్రులే కాదు.. ఇతర మంత్రులు కూడా వెనకంజ వేస్తున్నారంట. తమ నేతకు మంత్రి పదవి దక్కే వరకు ఇతర మంత్రులు ఎవరూ సెగ్మెంట్లో అడుగుపెట్టకూడదని చిన్న కోమటిరెడ్డి అనుచరులు అల్టిమేటం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో హేమాహేమీలైన జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, గుత్తా సుఖేందర్ రెడ్డి, ఆర్ దామోదర్ రెడ్డి లాంటి దిగ్గజ నేతలు రాష్ట్ర కాంగ్రెస్‌లో తమ ప్రాబల్యం చాటుకుంటున్నారు. ప్రస్తుతం జానారెడ్డి ప్రత్యక్ష రాజకీయాలకు దూరం జరిగినా, తన వారసుల్ని, వర్గీయుల్నీ పార్టీలో ప్రమోట్ చేసుకుంటూనే ఉన్నారు. ఇక కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి రేవంత్ సర్కార్ లో కీలక మంత్రులుగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు కొనసాగుతున్నారు. అయితే మంత్రి పదవిపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పెట్టుకున్న ఆశలు మాత్రం నెరవేరడం లేదు.
బీఆర్ఎస్‌ను ఓడించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2022లో ఆయన కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బిజెపిలో చేరారు. అదే ఏడాదిలో జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో బిజెపి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2023 ఎన్నికల సమయంలో బీజేపీ నుంచి వెనక్కి వచ్చి తిరిగి కాంగ్రెస్ లో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. పార్టీలో చేరే సమయంలో కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు మంత్రి పదవిపై హామీ ఇచ్చిందంట. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంగా మంత్రి పదవి కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రెండో విడత క్యాబినెట్ విస్తరణలో కూడా బెర్త్ దక్కకపోవడంతో ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారు.
జిల్లా మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డిలు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 11 నియోజకవర్గాల్లో పర్యటించారు. కానీ స్వతంత్రంగా వ్యవహరిస్తున్న రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గమైన మునుగోడులో మాత్రం ఇద్దరు మంత్రులూ ఇప్పటి వరకు అడుగు పెట్టలేదు. నియోజకవర్గ సమస్యలపై నేరుగా హైదరాబాదులోని ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ.. నేనే రాజు నేనే మంత్రి అన్నట్లుగా రాజగోపాల్ రెడ్డి వ్యవహరిస్తున్నారట. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వరించేవరకు మంత్రులెవ్వరూ మునుగోడులో పర్యటించాల్సిన అవసరం లేదని రాజగోపాల్ రెడ్డి అనుచరులు అల్టిమేటం ఇచ్చారంట.
ఆ క్రమంలో మంత్రి హోదాలో రాజగోపాల్ సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇప్పటివరకు మునుగోడు నియోజకవర్గంలో పర్యటించలేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కూడా మునుగోడులో రాజగోపాల్ రెడ్డి ఎంట్రీ పాస్ ఎందుకు ఇవ్వడంలేదో ఎవరికి అంత చిక్కడం లేదట.తనకు మంత్రి పదవి రాకుండా పరోక్షంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానా రెడ్డిలు అడ్డుపడి ఉంటారని రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నారట. అందుకే మంత్రి హోదాలో ఉత్తమ్ కుమార్ రెడ్డిని మునుగోడు నియోజకవర్గ పర్యటనకు ఆహ్వానించడం లేదట. సహజంగా వివాదాలకు దూరంగా ఉండే మంత్రి ఉత్తమ్ కూడా మునుగోడులో అడుగు పెట్టేందుకు ఆసక్తి చూపడం లేదట.
పట్టుదలకు మారుపేరైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముక్కుసూటిగా వ్యవహరిస్తారనే ప్రచారం ఉంది. తనకు మంత్రి పదవి వచ్చేవరకు నియోజకవర్గంలో ఏ మంత్రికి కూడా నో ఎంట్రీ అంటున్నారట. అందుకే రాష్ట్రమంతటా సుడిగాలి పర్యటన చేస్తున్న ఇతర మంత్రులు సైతం మునుగోడు వైపు చూడటం లేదంటున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ రాజకీయాలు అంటేనే రాష్ట్ర మంత్రులు దూరంగా ఉంటున్నారట. రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎంట్రీ పాస్ లేకుండా మునుగోడు పర్యటనకు వెళ్ళి కొత్త పంచాయతీ మొదలు పెట్టడం ఎందుకని మంత్రులు భావిస్తున్నారట.