ఈ నెల 18న నవంబర్ నెల శ్రీవారి ఆర్జిత టికెట్లు కోటా విడుదల
posted on Aug 14, 2025 7:54PM
.webp)
తిరుమల దర్శనం, గదుల నవంబర్ కోటా వివరాలను టీటీడీ విడుదల చేసింది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన నవంబర్ నెల కోటాను ఆగస్టు 18న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఆగస్టు 20న ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని సూచించింది.
ఈ టికెట్లు పొందిన భక్తులు ఆగస్టు 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయని వెల్లడించింది. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను ఆగస్టు 21న ఉదయం 10 గంటలకు ఆన్ లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు.
వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 21న మధ్యాహ్నం 3 గంటలకు ,
23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు , శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటాను 23న ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా
వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామి దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను 23న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపారు. 25న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను , మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామన్నారు. భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.