తెలంగాణలో కొత్తగా రెండు మున్సిపాలిటీలు
posted on Aug 14, 2025 8:31PM

తెలంగాణ మున్సిపల్ చట్ట సవరణ ఆర్డినెన్స్‌కు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆమోదం తెలిపారు. ఈ ఆర్డినెన్స్ ద్వారా సంగారెడ్డి జిల్లాలో ఇంద్రీశం, జిన్నారం మున్సిపాలిటీలు ఏర్పాటయ్యాయి. అంతేకాకుండా మున్సిపల్ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లు, కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నికల్లో రాజ్యసభ సభ్యులకు సైతం ఓటుహక్కు కల్పించేలా తెలంగాణ మున్సిపల్ చట్టంలోని సెక్షన్-20కి సవరణ చేశారు.ఈ సవరణలకు సంబంధించి న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేశారు.ఈ నిర్ణయం రాష్ట్రంలో పట్టణ అభివృద్ధి మరియు స్థానిక సంస్థల నిర్వహణలో మరింత సమర్థవంతమైన పాలనను సాధించేందుకు దోహదపడుతుందని భావిస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు సేవలను మరింత చేరువ చేయడం, స్థానిక అవసరాలను పరిగణనలోకి తీసుకుని పాలనను సులభతరం చేయడం కోసం నిరంతరం కృషి చేస్తోంది. ఈ క్రమంలో, సంగారెడ్డి జిల్లాలోని ఇంద్రేశంమరియు జిన్నారం ప్రాంతాలను మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ రెండు ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణ కేంద్రాలుగా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో పెరుగుతున్న జనాభా, వాణిజ్య కార్యకలాపాలు, మౌలిక సదుపాయాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.